బీసీ ల విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు. అవగాహన లేకుండా జనసేనాని మాట్లాడుతున్నారని విరుచుకుపడుతున్నారు.
అమరావతి: బీసీల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరైన అవగాహన లేక మాట్లాడుతున్నాడని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆదివారంనాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు ఏలూరులో బీసీ డిక్లరేషన్ ను తమ పార్టీ ప్రకటించిన విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.ఈ డిక్లరేషన్ ను తమ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. బీసీలను టీడీపీ ఓటు బ్యాంకుగా వాడుకుందని ఆయన విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పదవుల్లో పెద్దపీట వేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
పక్క రాష్ట్రంలో 26 కులాలను బీసీ జాబితా నుండి తొలగించిన విషయమై తాము మాట్లాడామన్నారు. పక్క రాష్ట్రం గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
undefined
ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం 95 శాతానికి పైగా అమలు చేసిందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు సీఎం జగన్ అండగా నిలిచారన్నారు.
కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ వల్ల ఏమి ఉపయోగం లేదన్నారు మంత్రి. రాష్ట్రం అభివృద్ది వైపు వెళ్తుంటే కొందరు ఉద్దేశ్యపూర్వకంగా అభివృద్దిని అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.