
తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఎండవేడి, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంటే.. మరోవైపు అన్నదాతలు నట్టేట మునిగిపోయారు. రెండు రాష్ట్రాల్లోనూ లక్షలాది ఎకరాల్లో పలు పంటలకు వర్షం కారణంగా తీవ్ర నష్టం కలిగింది. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని.. వడగండ్ల వానతో కూడిన వర్షాలు వారిని మరింత కృంగదీస్తున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మిర్చి రైతులు.. ఉమ్మడి కృష్ణా , పశ్చిమ గోదావరిలలో.. మామిడి, పొగాకు, మొక్కజొన్న రైతులు.. ఉమ్మడి అనంతలో ఉద్యానవన పంటలు.. నెల్లూరులో వరి పంటకు తీవ్ర నష్టం కలిగిందని జనసేనాని వెల్లడించారు. వీటితో పాటు అరటి, మొక్కజోన్న, కర్బూజ , బొప్పాయి పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయని పవన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.
Also REad: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్..!
ఇదిలావుండగా.. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకన్ తీరం వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో శని, ఆది వారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర, గోదావరి, దక్షిణ కోస్తా జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.