తమ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటుపడుతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. చంద్రబాబునాయుడు సర్కార్ పేదలకు ఎలాంటి ప్రయోజనం కల్గించలేదన్నారు.
అమరావతి: తమ ప్రభుత్వం పేదలకు మంచి చేయలేదని నమ్మితే పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని టీడీపీని ప్రశ్నించారు ఏపీ సీఎం వైఎస్ జగన్ .
ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరులో జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదివారంనాడు విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ఎందుకు ఈ తోడేళ్లు ఏకమౌతున్నాయని ఆయన విపక్షాలను అడిగారు. అర్హత లేనివారంతా తమ ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారని సీఎం జగన్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
undefined
రాజకీయ, కుటుంబ విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నట్టుగా సీఎం జగన్ చెప్పారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో దోచుకో , పంచుకో, తినుకో అనే విధంగా వ్యవహరం ఉండేదన్నారు. కానీ తమ ప్రభుత్వం పేదలకు నేరుగా డీబీటీ ద్వారా నిధులను అందిస్తున్నామని సీఎం జగన్ వివరించారు. ఏ సినిమాకు వెళ్లినా హీరోనే నచ్చుతాడు, విలన్ నచ్చడని సీఎం జగన్ చెప్పారు. ఎన్ని కుతంత్రాలు చేసినా చివరికి మంచే గెలుస్తుందని సీఎం జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. మహాభారతం, బైబిల్, ఖురాన్ ఏది చూసినా ఇదే చెబుతుందని సీఎం జగన్ గుర్తు చేశారు.
ఒక కుటుంబం తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంటుందని సీఎం జగన్ చెప్పారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి విద్య మాత్రమేనని ఆయన చెప్పారు. ఒక మనిషి జీవన ప్రమాణం, జీవన ప్రయాణం నిర్ధేశించేది చదువేనని సీఎం జగన్ తెలిపారు. ఒక మనిషి పేదరికం నుండి బయటపడాలంటే చదువుతోనే సాధ్యమన్నారు.
విద్యార్ధుల పూర్తి ఫీజుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ను అరకొరగా ఇచ్చేదని సీఎం జగన్ విమర్శించారు. దీంతో ఫీజులు కట్టలేక విద్యార్ధులు అవస్థలు పడేవారని ఆయన చెప్పారు. :ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడ ఉన్నాయని సీఎం జగన్ గుర్తు చేశారు. అందుకే విద్యార్ధులందరికీ పూర్తి ఫీజు రీ ఎంబర్స్ మెంట్ అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. గత ప్రభుత్వం ఎందుకు పేదలకు మంచి చేయలేకపోయిందని సీఎం జగన్ ప్రశ్నించారు.
కార్పోరేట్ స్కూళ్లే ప్రభుత్వ స్కూళ్లతో పోటీ పడేలా చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. రెండేళ్లలో ప్రభుత్వ స్కూళ్లను డిజిటలైజేషన్ చేస్తానని సీఎం జగన్ తెలిపారు.