స్నేహలత దారుణ హత్యకు కారణమదే..: పవన్ కల్యాణ్ సీరియస్

By Arun Kumar PFirst Published Dec 24, 2020, 4:20 PM IST
Highlights

తమ బిడ్డను వేధిస్తున్నారు... మా ఇంటి ముందుకు వచ్చి భయపెడుతున్నారు అని స్నేహలత తల్లిదండ్రులు పోలీస్ స్టేషనుకు వెళ్తే అధికారులు ప్రవర్తన వారిని మరింత కుంగదీసిందని జనసేనాని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

విజయవాడ: ప్రచారం కోసం చట్టాలు చేస్తే మహిళలకు రక్షణ దొరుకుతుందా? అని వైసిపి ప్రభుత్వాన్ని నిలదీశారు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్. వ్యవస్థల వైఫల్యమే స్నేహలత ప్రాణాలు తీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యమే స్నేహలత ప్రాణాలు తీసిందని పవన కల్యాణ్ ఆరోపించారు. 
 
''మహిళల రక్షణ కోసం దిశ చట్టం చేశాం... నేరం చేసినవారికి21 రోజుల్లో శిక్ష పడుతుంది అంటూ ప్రచారం చేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. సరికదా మైనర్ బాలికలు, విద్యార్థినులు, యువతులు, మహిళలపై అఘాయిత్యాలు, దాడులు ఆగలేదు. ఉన్మాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం ఉండటం లేదు'' అని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

''విజయవాడలో రెండు ఘటనలు, గాజువాకలో ఒక ఘటనలో యువతులు మృగాళ్ల చేతుల్లో హత్యకు గురయ్యారు. ఇప్పుడు అనంతపురం జిల్లా ధర్మవరంలో స్నేహలత అనే పేద దళిత యువతి హత్యకు గురవడం అత్యంత బాధాకరం. ఈ ఘటన పూర్వాపరాలను అనంతపురం జిల్లా జనసేన నాయకులు తెలియచేశారు. పేద కుటుంబానికి చెందిన స్నేహలత వేధింపులు భరించలేక చదువు మధ్యలోనే విడిచిపెట్టి చిన్నపాటి ఉద్యోగంలో చేరిందని తెలిసింది'' అన్నారు.

''తమ బిడ్డను వేధిస్తున్నారు... మా ఇంటి ముందుకు వచ్చి భయపెడుతున్నారు అని పోలీస్ స్టేషనుకు వెళ్తే అధికారులు ప్రవర్తన ఆ తల్లితండ్రులను మరింత కుంగదీసింది. ‘అక్కడి నుంచి ఇల్లు మారిపొండి’ అని పోలీసు సలహా ఇవ్వడంచూస్తే ఆ వ్యవస్థ ఎంత బాధ్యతారాహిత్యంతో ఉందో అర్థం అవుతోంది. వ్యవస్థల వైఫల్యం వల్లే స్నేహలత ఇద్దరు దుర్మార్గుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలి. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలి'' అని కోరుకున్నారు. 

''చిత్తశుద్ధి లేకుండా ప్రచారం కోసం చట్టాలు చేస్తే ఎంత మాత్రం ప్రయోజనం ఉండదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ దిశ చట్టమే. దిశ చట్టం వచ్చి ఏడాది అయింది. చట్టం చేయగానే పాలాభిషేకాలు చేయించుకొని... కేకులు కోయించుకున్నారు. చట్టాన్ని మాత్రం ఆచరణలోకి తీసుకురాలేదు. ఆడ బిడ్డలపై పెట్రోలు పోసి నిప్పు పెట్టడాలు... కత్తిపోట్లు మాత్రం ఆగలేదు. ప్రచారం కోసం చేసిన ఈ చట్టం ఆడబిడ్డలకు ఏ విధంగా రక్షణ ఇస్తుందో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు, హోంశాఖ మంత్రి సుచరిత గారు ప్రజలకు సమాధానం చెప్పాలి'' అని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

click me!