కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ జనసేన కార్యాలయంవద్ద కలకలం రేగింది. ఓ సీనియర్ నేత హత్యకు కుట్రపన్నిన దుండగులు పార్టీ ఆఫీసు వద్ద రెక్కీ నిర్వహించారు.
కాకినాడ : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. గెలుపుకోసం ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. చివరకు కొందరు నాయకులు హత్యారాజకీయాలకు కూడా సిద్దమవుతున్నారట... ఇలా జనసేన పార్టీ నాయకుడి హత్యకు రెక్కీ జరిగిందని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ దృష్టికి కూడా వచ్చినట్లు ఆయన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ వెల్లడించారు.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం ముందే దుండగులు కత్తులతో రెక్కీ నిర్వహించారని హరిప్రసాద్ తెలిపారు. సీనియర్ నాయకులు మాదేపల్లి శ్రీనివాస్ రావు కోసమే దుండగులు వచ్చినట్లు తెలుస్తోందన్నారు. పట్టపగలే దుండగులు కత్తులతో రావడంతో కార్యాలయంలోని నాయకులంతా అప్రమత్తం అయ్యారు... దీంతో దుండుగులు పారిపోయినట్లు తెలిపారు.
Also Read సీట్ల సర్దుబాటుపై రాని క్లారిటీ ? మరోసారి బాబు, పవన్ భేటీ.. బీజేపీతో పొత్తు ఉంటుందా?
అయితే ఈ వ్యవహారాన్ని పిఠాపురం జనసేన ఇంచార్జీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. దుండగులు రెక్కీ నిర్వహిస్తున్న దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డవగా ఆ వీడియోను పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకోవాలని ... పోలీసులకు ఫిర్యాదు చేసి దుండగులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూడాలని సూచించారు. అంతేకాదు ఈ రెక్కీ వెనక ఎవరున్నారో కూడా తేల్చాలని ... ఎంతటివారు ఉన్నా వదిలిపెట్టకూడదని పవన్ పోలీసులను కోరారు.