వలస కూలీల దుర్మరణం...రాష్ట్ర ప్రభుత్వాలకు పవన్ కల్యాణ్ సూచనిదే

By Arun Kumar PFirst Published May 8, 2020, 1:30 PM IST
Highlights

మహారాష్ట్రలో జరిగిన రైలు ప్రమాదంలో వలసకూలీల దుర్మరణం పాలవడంపై జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

విజయవాడ: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ దగ్గర చోటుచేసుకున్న గూడ్స్ ట్రైన్ ప్రమాదంలో 16మంది మృత్యువాతపడ్డారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు పవన్ కల్యాణ్. 

''ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలి. వీరంతా మధ్యప్రదేశ్ నుంచి పొట్టకూటి కోసం మహారాష్ట్రకు వలస వచ్చిన కూలీలు కావడం మరింత బాధాకరం. లాక్ డౌన్ తో ఉపాధి లేక స్వస్థలాలకు కాలినడకన వెళ్తూ పట్టాలపైనే పడుకున్నారని తెలిసింది. ఈ సమయంలో వారు  ప్రమాదానికి గురయి మరణించడం దారుణం'' అని అన్నారు. 

''వలస కూలీలను సొంత రాష్ట్రాలకు తరలించడం కోసం కేంద్రం శ్రామిక్ రైళ్లను నడుపుతోంది. వీటికి సంబంధించిన సమన్వయ బాధ్యతలను చేపట్టడంలో, సంబంధిత సమాచారాన్ని కూలీలకు అందించడంలో రాష్ట్రాలు మరింత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ దుర్ఘటన తెలియచేస్తోంది'' అని పవన్ కల్యాణ్ అన్నారు.

 కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా హటాత్తుగా దేశంలో లాక్ డౌన్ విధించడంతో చాలామంది వలసకూలీలు ఇతర రాష్ట్రాలో చిక్కుకున్నారు. అలా మహారాష్ట్రలో చిక్కుకున్న మధ్యప్రదేశ్ కు చెందిన వలసకూలీలు కాలినడకన తమ స్వస్థలాలకు వెళ్లే ప్రయత్నం చేసి మృత్యువాతపడ్డారు. ఔరంగాబాద్ లో రైలు ప్రమాదానికి గురవడంతో 16మంది వలసకూలీలు మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 


  
 

click me!