అభిమానుల కుటుంబాలకు పవన్ అండ... రూ.2లక్షల ఆర్థిక సాయం

By Arun Kumar PFirst Published Sep 2, 2020, 10:30 AM IST
Highlights

 విద్యుత్ ప్రమాదంలో చనిపోయిన తన అభిమానుల కుటుంబాలకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ అండగా నిలిచారు.

అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో చోటు చేసుకున్న విద్యుత్ ప్రమాదంలో చనిపోయిన తన అభిమానుల కుటుంబాలకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలని పార్టీ కార్యాలయానికి  పవన్ కల్యాణ్ ఆదేశించారని జనసేన మీడియా విభాగం వెల్లడించింది. 

ఇక ఈ దుర్ఘటనపై ఇదివరకే పవన్ కల్యాణ్ ఆవేదనను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ''జన సైనికుల మరణం మాటలకు అందని విషాదం. గుండెల నిండా నా పట్ల అభిమానం నింపుకొన్న కుప్పం నియోజకవర్గ జనసైనికులు సోమశేఖర్,  రాజేంద్ర,  అరుణాచలం విద్యుత్ షాక్ తో దుర్మరణం పాలవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. శాంతిపురం దగ్గర కటౌట్ కడుతూనే విద్యుత్ షాక్ తగలడంతో వారు చనిపోయారనే వార్త నా మనసుని కలచివేసింది. ఇది మాటలకు అందని విషాదం. ఆ తల్లితండ్రుల గర్భ శోకాన్ని అర్థం చేసుకోగలను'' అంటూ భాదిత కుటుంబాల పట్ల సానుభూతి ప్రకటించారు. 

''దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేను కనుక ఆ తల్లితండ్రులకు నేనే ఒక బిడ్డగా నిలుస్తాను. ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకొంటాను. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను'' అన్నారు. 

''మరో ముగ్గురు జన సైనికులు హరికృష్ణ, పవన్,  సుబ్రహ్మణ్యం చికిత్స పొందుతున్నారు అనే సమాచారం ఉంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని స్థానిక నాయకులకు తెలిపాను. వారు త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబాలకు అవసరమైన తక్షణ సహాయం అందించాలని చిత్తూరు జిల్లా జనసేన నాయకులకు సూచించాను'' అని పవన్ కల్యాణ్ తెలిపారు. 

read more  పవన్ అభిమానుల మృతి: చంద్రబాబు దిగ్భ్రాంతి

చిత్తూరు జిల్లా కుప్పంలో పవన్ జన్మదినోత్సవానికి సంబంధించి ఫ్లెక్సి కడుతుండగా విద్యుత్ షాక్‌తో ముగ్గురు అభిమానులు మరణించారు. సుమారు 25 అడుగుల ఎత్తున ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ వైర్లు తగలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

పవన్ బర్త్ డే సందర్భంగా అభిమానులు వేడుకలకు ప్లాన్ చేశారు. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండటంతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. ఇదే ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్ధితి విషమంగా ఉంది. కుప్పం- పలమనేరు జాతీయ రహదారిపై బ్యానర్ కడుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరణించిన వారిని సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలంగా గుర్తించారు.

click me!