
అమరావతి : తెలుగు స్టార్ హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్లాస్టిక్ ప్లెక్సీలు, బ్యానర్లను నిషేధించిందని మెగా అభిమానులతో పాటు జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. రాజకీయంగా పవన్ ను ఎదుర్కోలేకే ఇలాంటి చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని జగన్ సర్కార్ పై మండిపడుతున్నారు. త్వరలో పవన్ పుట్టిన రోజు నేపథ్యంలో అభిమానులు భారీగా బ్యానర్లు, ప్లెక్సీలు ఏర్పాటుచేసి సందడి చేస్తారు కాబట్టే ప్లాస్టిక్ నిషేదమంటూ ప్రభుత్వం కొత్తనాటకానికి తెరతీసిందని విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో ప్లాస్టిక్ నిషేధంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై పవన్ కల్యాణ్ స్పందించారు.
ప్రమాదకర వాయువులు లీకై ఇప్పటికే అనేకమంది ప్రాణాలు కోల్పోయారు... అయినా విశాఖపట్నంలో ఇండస్ట్రియల్ కాలుష్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పవన్ గుర్తుచేసారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి విషవాయువుల లీకేజీకి కారణమై అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకున్న కంపనీల యాజమాన్యాలను చర్యలు లేవని... ఏ ఒక్కరికీ ఇప్పటివరకు శిక్షలు పడలేవని పవన్ మండిపడ్డారు. అలాంటిది ఇదే విశాఖ గడ్డపై పర్యావరణ పరిరక్షణ పేరిట ప్లాస్టిక్ నిషేదమంటూ సీఎం జగన్ ప్రకటన విడ్డూరంగా వుందని అన్నారు.
ఇక ఇదే విశాఖపట్నంలో పచ్చటి ప్రకృతితో కళకళలాడే రుషికొండను ఆక్రమించుకునేందుకు విధ్వంసం చేసారు. అలాంటి మీకు ఇంత అత్యవసరంగా పర్యావరణంపై ప్రేమ పుట్టుకొచ్చింది? ఎందుకీ ధ్వంధ్వ వైఖరి? అంటూ జగన్ సర్కార్ ను పవన్ ప్రశ్నించారు.
read more హలో బ్రదర్ సినిమాలో విలన్‌లా జగన్.. ఏపీలో ప్లాస్టిక్ నిషేధంపై బుచ్చయ్య చౌదరి సెటైర్లు
''రాష్ట్ర ప్రభుత్వానికి పర్యావరణంపై ఉన్న పళంగా ప్రేమ కలిగింది. కాబట్టి కాలుష్యాన్ని వెదజల్లుతూ జల వనరులను, పంట పొలాలను, మత్స్య సంపదను నాశనం చేస్తున్న సిమెంట్ కంపెనీలు, ఫార్మా సంస్థలు, రసాయన పరిశ్రమల్లాంటి వివరాలు సేకరించాలి. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఏ మేరకు ఈ వివరాలను పొందుపరిచిందో? అయినా మన వంతు బాధ్యతగా అన్ని వివరాలూ బయటకు తీసుకువద్దాం'' అంటూ పవన్ జనసేన శ్రేణులకు, ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు.
''మన జనసేన పార్టీ మూల సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం గురించి చెబుతూ రాష్ట్రంలో ఉన్న ఈ కాలుష్య కారక పరిశ్రమలు, మైనింగ్ సంస్థలు వాటి మూలంగా కలుగుతున్న హానిని ప్రజా క్షేత్రంలో వెల్లడిద్దాం'' అంటూ ప్లాస్టిక్ నిషేధమంటూ సీఎం జగన్ ప్రకటనకు పవన్ ట్విట్టర్ వేధికన కౌంటరిచ్చారు.
ఇదిలావుంటే గత శుక్రవారం విశాఖలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లు తెలిపారు. దారిపొడవునా తన ఫోటోలతో బ్యానర్లు కట్టడం చూసానని... ఇకపై ఇలా రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఉండబోవని జగన్ అన్నారు. అయితే ఎక్కడైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే కాస్త ఖరీదైనప్పటికి ప్లాస్టిక్ తో కాకుండా బట్టతో చేసిన ఫ్లెక్సీలనే ఉపయోగించాలని జగన్ కోరారు. తిరుమలలో ప్లాస్టిక్ లేకుండా తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని... 2027 చివరి నాటికి ప్లాస్టిక్ లేని రాష్ట్రంగా మార్చుతామని సీఎం జగన్ ప్రకటించారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే అబివృద్దిని సాధించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు.