అమరావతికి మద్ధతిస్తే దాడి చేస్తారా.. వైసీపీ దాదాగిరీకి ఇది పరాకాష్ట : సత్యకుమార్‌పై దాడి ఘటనపై పవన్

By Siva KodatiFirst Published Mar 31, 2023, 7:46 PM IST
Highlights

అమరావతికి మద్ధతు పలికిన సత్యకుమార్‌పై దాడి చేయడం సరికాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాజధాని రైతులకు అండగా నిలుస్తున్న రాజకీయ పక్షాలను , సంఘాలను ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు శత్రువులుగా చూస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

ఏపీ రాజధాని అమరావతిలో బీజేపీ జాతీయ సత్యకుమార్‌పై దాడిని ఖండించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అమరావతికి మద్ధతు పలికిన సత్యకుమార్‌పై దాడి చేయడం సరికాదన్నారు. అధికారంలో వున్న వైసీపీ దాదాగిరీ పరాకాష్టకు చేరిందని.. ఈ దాడిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని పవన్ పిలుపునిచ్చారు. రాజధాని రైతులకు మద్ధతుగా నిలిస్తే దాడులు చేస్తామని వైసీపీ పాలకులు సందేశం ఇస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి తప్పించుకున్నారని వైసీపీ ఎంపీ చేసిన ప్రకటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. 

ఈ దాడిపై బీజేపీ అధినాయకత్వం తీవ్రంగా పరిగణించాలని ఆయన కోరారు. మూడు రాజధానులు అంటూ ప్రజలను మభ్యపెడుతున్న ముఖ్యమంత్రిని, ఆయన పార్టీని పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని జనసేనాని చురకలంటించారు. రాజధాని రైతులకు అండగా నిలుస్తున్న రాజకీయ పక్షాలను , సంఘాలను ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు శత్రువులుగా చూస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ దౌర్జాన్యాలను త్వరలోనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

Latest Videos

ఇదిలావుండగా.. సత్యకుమార్‌పై దాడి ఘటన వెనుక వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ప్రమేయం వుందంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సురేష్ స్పందించారు. సత్యకుమార్‌పై దాడి ఘటనలో తన ప్రమేయం లేదని ఆయన తేల్చిచెప్పారు. ఎస్సీ మహిళలను కొట్టమని హైకమాండ్ చెప్పిందా అంటూ బీజేపీ నేతలపై ఆయన భగ్గుమన్నారు. దాడి జరిగేటప్పుడు తాను లంక పొలాల్లో వున్నానని.. తనకు సమాచారం తెలిసి వచ్చేటప్పటికే గొడవ మొత్తం జరిగిందని సురేష్ పేర్కొన్నారు. చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి వేరు వేరు కాదన్న ఆయన.. చంద్రబాబు చెప్పిందే ఆదినారాయణ రెడ్డి చేస్తారని స్పష్టం చేశారు. 

తాము అమరావతి రాజధానిలో ధర్నాలు జరుగుతున్న ప్రాంతంలో గొడవలు పెట్టలేదని నందిగం సురేష్ పేర్కొన్నారు. మహిళలని కూడా చూడకుండా బీజేపీ నేతలు కొట్టారని ఆయన ఆరోపించారు. ఇళ్ల స్థలాల కోసం ధర్నాలు చేస్తున్న వాళ్లను కొడతారా అంటూ సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వాళ్లు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. రాజధాని రైతుల ఆందోళనకు 1200 రోజులు గడుస్తున్న సమయాన్ని చూసుకుని కావాలనే గొడవ చేశారని నందిగం సురేష్ పేర్కొన్నారు. టీడీపీ డైరెక్షన్‌లోనే బీజేపీ నేతల దాడి జరిగిందని.. తమకు సంబంధం లేని విషయాలు మాపై రుద్దుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుజనులు ఏ పార్టీలో వున్నా అండగా వుంటానని.. తాను ఏపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడినని నందిగం సురేష్ వెల్లడించారు.

 

రాజధాని రైతులకు మద్దతుగా నిలిస్తే దాడులు చేస్తారా? - JanaSena Chief Shri pic.twitter.com/xZFunFNUt6

— JanaSena Party (@JanaSenaParty)
click me!