ఎన్డీయే‌కు జనసేన గుడ్ బై?.. పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలతో క్లారిటీ..!

Google News Follow Us

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం తథ్యం అని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. తమ కూటమికి ప్రజల సంపూర్ణ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబుతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ అయిన తర్వాత.. రానున్న ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీల పొత్తు ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో.. తాను ఎన్డీయే కూటమిలో ఉన్నానని, బీజేపీ కూడా తమతో కలిస వస్తుందనే ఆశాభావం కూడా పవన్ వ్యక్తం చేశారు. అయితే తాజాగా జనసేన వారాహి యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా పెడనలో బుధవారం జరిగిన భారీ బహిరంగ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. జనసేన ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిందనే విధంగా ఉన్నాయి. ఎందుకంటే.. కష్టకాలంలో టీడీపీకి మద్దతు ఇచ్చేందుకే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నుంచి బయటకు వచ్చానని పవన్ పేర్కొన్నారు.

ఆ సభలో పవన్  మాట్లాడుతూ.. ‘‘నేను ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యం అయి ఉండి, చాలా ఇబ్బందులు ఉండి కూడా.. ఎందుకు బయటకు వచ్చి టీడీపీకి 100 శాతం మద్దతు తెలిపానంటే.. తెలుగుదేశం పార్టీ బలహీన పరిస్థితులో ఉందనే భావన ఉన్నప్పుడు.. టీడీపీ అనుభవం ఏపీకి చాలా అవసరం, జనసేన యువరక్తం మీకు అవసరం.. టీడీపీ అనుభవం, జనసేన పోరాట పటిమ రెండు కలిస్తే జగన్‌ను అథఃపాతాళానికి తొక్కేయొచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బలంగా పోరాడాలి’’ అని టీడీపీ, జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. 

ఇంకా, రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం తథ్యం అని పవన్ ధీమా వ్యక్తం చేశారు. తమ కూటమికి ప్రజల సంపూర్ణ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ కూటమి కలిసే వెళ్తాయనీ.. కేంద్రం ఆశీస్సులు తమ కూటమికి ఉండాలని కోరుకుంటున్నట్టుగా కూడా పవన్ తెలిపారు. 

ఇక, చాలా కాలంగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని పవన్ కల్యాణ్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన రానున్న ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు ముందడుగు వేశారు. పవన్ ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో బీజేపీ నేతలు, జనసేన నాయకుల మధ్య సరైన అవగాహన లేదనే విశ్లేషణలు ఉన్నాయి. అయితే టీడీపీతో పొత్తు ప్రకటించిన పవన్ కల్యాణ్.. బీజేపీ కూడా ముందకు వస్తే కలిసి వెళ్లాలని భావించినట్టుగా తెలుస్తోంది. అయితే తాజాగా కేవలం టీడీపీ, జనసేన కూటమి అనే మాట్లాడటం.. బీజేపీ ప్రస్తావన తీసుకురాకుండా కేంద్రం ఆశీస్సులు మాత్రం ఉండాలని అనడం చూస్తుంటే.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్టుగానే  కనిపిస్తుంది. పవన్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో.. ఎన్డీయే నుంచి జనసేన బయటకు వచ్చిందని పలు మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. దీనిపై జనసేన ఎదైనా అధికార ప్రకటన విడుదల చేస్తుందో? లేదో? వేచిచూడాల్సి ఉంది. 

Read more Articles on