పదవులపై ఆశ లేదు.. కానీ సీఎం పదవిస్తే ఎక్కువే చేయగలను: మనసులో మాట చెప్పిన పవన్

Siva Kodati |  
Published : Apr 03, 2021, 08:44 PM ISTUpdated : Apr 03, 2021, 09:05 PM IST
పదవులపై ఆశ లేదు.. కానీ సీఎం పదవిస్తే ఎక్కువే చేయగలను: మనసులో మాట చెప్పిన పవన్

సారాంశం

జనసైనికులు లేనిదే జనసేన లేదని, తాను కూడా లేనన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ- జనసేనల తరపున ఆయన శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జీవితంలో ఎలాంటి కోరికలు లేకున్నా అనువణువునా దేశభక్తి వుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు

జనసైనికులు లేనిదే జనసేన లేదని, తాను కూడా లేనన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ- జనసేనల తరపున ఆయన శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

జీవితంలో ఎలాంటి కోరికలు లేకున్నా అనువణువునా దేశభక్తి వుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కొందరు తమ అబ్బసొత్తులా దేశాన్ని దోచుకుంటున్నారని.. కోట్లు సంపాదిస్తున్నానని, కోట్ల ట్యాక్స్ కడుతున్నానని, ప్రజలకు ఇస్తున్నానని జనసేనాని చెప్పారు.

కాంట్రాక్టులతో, ఇతర పనులతో దోచుకున్న డబ్బుతో కాదని పవన్ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ- జనసేన కూటమి ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించనుందని ఆయన జోస్యం చెప్పారు.

ప్రజలు కష్టపడి ట్యాక్స్ కడుతున్నారని.. ప్రజల డబ్బును కొందరు  తమ సిమెంట్ ఫ్యాక్టరీలకు, సారా గోడౌన్‌లకు తరలిస్తున్నారని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల సొమ్మును దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోనని.. పులివెందుల అనగానే రౌడీయిజం గుర్తుస్తోందంటూ ఆయన మండిపడ్డారు.

భయపెట్టేవాళ్లను చూసి భయపడేవాడు పవన్ కాదు, జనసైనికుడు కాదని పవన్ స్పష్టం చేశారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు గుండాల్లా మాట్లాడుతున్నారని.. మీరు ఎమ్మెల్యేలా, లేక గుండాలా అంటూ ఆయన దుయ్యబట్టారు.

తలతెగిపడ్డా నా అడుగు వెనక్కిపడదని పవన్ ఉద్వేగంగా చెప్పారు. తాను పదవులు ఆశించనని.. సీఎం పదవి వస్తే అందరికంటే ఎక్కువ పనిచేయగలనని ఆయన స్పష్టం చేశారు. నిజాయితీగా సేవ చేస్తానని జనసేనాని వెల్లడించారు.

వైఎస్ వివేకా హత్య కేసును తేల్చేని విధంగా లా అండ్ ఆర్డర్ దిగజారిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. నిందితులు మీకు తెలిసినా పట్టించుకోవడం లేదని.. సొంత చిన్నాన్నను చంపిన వారిని వెనకేసుకొస్తున్నారని ఆయన ఆరోపించారు.

కోడి కత్తి కేసు ఏమైందన్న ఆయన.. నిందితులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. ఎర్రచందనాన్ని చైనాకు డోర్ డెలివరీ చేస్తున్నారని పవన్ ఆరోపించారు. ఒక ఎమ్మెల్యే బెదిరిస్తే భయపడిపోతారా .. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలని జనసేనాని పిలుపునిచ్చారు.

వైసీపీ ఎమ్మెల్యేలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని పవన్ ప్రశ్నించారు. నాకు సినిమాలు చేయడం మాత్రమే తెలుసునని.. పేకాట క్లబ్బులు లేవని ఆయన వెల్లడించారు. ఏడాదిలోగా ఏపీ దశ, దిశ మారాలని.. డబ్బుకు ఓటు కొనే పరిస్ధితి పోవాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.

వైసీపీ అభ్యర్ధి గెలిస్తే ఢిల్లీ వెళ్లి ఏం చేస్తాడు.. మాట్లాడటానికి గొంతు కూడా రాదని ఆయన ఎద్దేవా చేశారు.  దేశం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని.. ఓటు వేయడానికి గంట సేపు క్యూలో నిల్చోలేరా అంటూ పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. పవన్‌పై మా నిర్ణయంతో కొన్ని పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని వీర్రాజు ధ్వజమెత్తారు. ఏపీలో గుండా గిరి ప్రభుత్వం నడుస్తోందని ఆయన మండిపడ్డారు. తిరుపతి బీజేపీ- జనసేన అభ్యర్ధి రత్నప్రభ మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే ఏపీకి కొత్త దారి చూపిస్తానని చెప్పారు. తనకు పవన్ తమ్ముడు తోడుగా వున్నాడన్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్