ఆ తర్వాతే నిర్ణయం..: ఎన్నికల్లో పొత్తులపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Published : Jul 09, 2023, 09:23 AM IST
 ఆ తర్వాతే నిర్ణయం..: ఎన్నికల్లో పొత్తులపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం ఉంటుందని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. నిస్వార్ధంగా కష్టపడితే అధికారం దానంతటదే వస్తుందని పేర్కొన్నారు. జనసేన వారాహి విజయ యాత్ర రెండో దశ జులై 9న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర సాగిన నియోజకవర్గాల ఇన్చార్జులు, పరిశీలకులతో పవన్ కల్యాణ్ శనివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఎన్నికల్లో పొత్తుల గురించి ఆలోచించేందుకు ఇంకా సమయం ఉందని అన్నారు. ఒంటరిగా వెళ్లాలా, కలసి వెళ్లాలా అనేది తరవాత మాట్లాడుకునే విషయమని స్పష్టం చేశారు. మండల స్థాయిలో సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బలంగా పనిచేస్తే అధికారం దానంతట అదే వచ్చి తీరుతుందని.. పార్టీ శ్రేణులు ఇందుకు అనుగుణంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. 

జనసేన పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తుందని అన్నారు. ఎలాంటి సమస్యపై జనసేన మాట్లాడినా అది ప్రజల్లోకి చేరిపోతోందని చెప్పారు. జనసేన పార్టీ ప్రజల్లోనే ఉందని.. ఉభయ గోదావరి జిల్లాల్లో అది మరింత బలంగా ఉందని తెలిపారు. వారాహి యాత్రకు జనం వస్తున్నారని.. పార్టీ నాయకత్వం దాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. వారాహి విజయ యాత్ర విజయం తాలూకు పునాదులను ఆసరాగా చేసుకుని ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఆదివారం నుంచి ప్రారంభం కాబోయే వారాహి విజయ యాత్ర మలి దశకు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని కోరారు. 

అదే సమయంలో ఏపీలో అధికార వైసీపీపై పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో రూల్ ఆఫ్‌ లాను వైసీపీ పూర్తి  విస్మరించిందని విమర్శించారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనే అంశాన్ని అవివేకంతో మాట్లాడడం లేదని చెప్పారు. సీఎం జగన్, వైసీపీ నాయకులు వెళ్లే మార్గం తప్పు అని విమర్శించారు. వైసీపీ పాలనలో అవినీతి తారా స్థాయికి చేరిపోయిందని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జనసేన రోడ్ల మీదకు రావాల్సి వచ్చిందని అన్నారు. వైసీపీని ఎన్నుకున్న వారం రోజుల్లోనే ప్రజలకు చేసిన తప్పు అర్ధం అయిపోయిందని అన్నారు. ఇప్పుడు 70 శాతం ప్రజలకు అది తెలిసిపోయిందని చెప్పారు. 

రాష్ట్రంలో గంజాయి విక్రయాలు పెరిగిపోయాయని విమర్శించారు. 30 వేల మంది అమ్మాయిలు మిస్సయ్యారని ఆరోపించారు. ఈ అంశం మీద కనీసం రివ్యూ చేసే పరిస్థితులు లేవని అన్నారు. ఇది చాలా పెద్ద సమస్య అని.. అయినా ఈ అంశం మీద కనీసం ఎవరూ మాట్లాడరని అన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతే రాష్ట్రం అధోగతిపాలవుతుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి స్థిరత్వం తీసుకురావడమే వచ్చే ఎన్నికల తాలూకు ముఖ్య ఉద్దేశమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

ఇక, గత  కొంతకాలంగా  వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని పవన్ కల్యాణ్ కామెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఒకే రకమైన ఆలోచనలు ఉన్న పార్టీలతో పొత్తుగా వెళ్లాలనేది తన అభిప్రాయమని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా పవన్  తొలి విడత వారాహి యాత్రలో పవన్ పొత్తులపై ముందుకు వెళ్లాలనే మాటను వినిపించలేదు. దీంతో ఆయన వైఖరిలో మార్పు వచ్చినట్టుగా కనిపిస్తుందనే ప్రచారం సాగుతుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!