
నాకు వెయ్యి కోట్ల ఆఫర్ చేశారని అంటున్నారని.. డబ్బుతో మీ గుండెల్లో స్థానం సంపాదించగలనా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. గతంలో ప్యాకేజ్ అంటే చెప్పు చూపించానని.. ఆ చెప్పులు తెనాలిలో తయారయ్యారని.. ఈసారి చెప్పు చూపిస్తే వాటితోనే కొడతానని పవన్ వైసీపీ నేతలను హెచ్చరించారు. తాను డబ్బులకు ఆశపడే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన జనసేన పదవ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ పెట్టినప్పుడు తనకు రాజకీయాలు తెలియవన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పవన్ వెనకడుగు వేయడని వ్యాఖ్యానించారు. సగటు మనిషికి మేలు చేయాలనే తపనతోనే పార్టీ పెట్టినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
చిన్నప్పటి నుంచి సమాజ శ్రేయస్సు గురించి తనకు ఆలోచన వుండేదని ఆయన వెల్లడించారు. ధైర్యం చేసి పార్టీ ఏర్పాటు చేశానన్న పవన్.. స్వాతంత్య్రమ ఉద్యమ నాయకులే అందుకు స్పూర్తి అన్నారు. బ్రిటీష్ వారు కూడా నేతాజీకి భయపడే స్వాతంత్ర్యం ఇచ్చారని పవన్ తెలిపారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య చివరి దశలో ఆకలితో అలమటించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు బలిదానంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని.. మహనీయులను దృష్టిలో పెట్టుకుని తన వంతు కృషి కోసం తపించినట్లు పవన్ వెల్లడించారు. పదేళ్ల కిందట పార్టీ పెట్టినప్పుడు తన వెనుక ఎవరూ లేరన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
జనసేన పార్టీని ఏడు సిద్ధాంతాల ఆధారంగా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఒక కులానికి అనుకూలంగా, మరో కులానికి వ్యతిరేకంగా తాను పనిచేయనని పవన్ స్పష్టం చేశారు. ఖచ్చితంగా జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జనసేనకు 6 లక్షలకు పైగా క్రియాశీలక కార్యకర్తలున్నారని పవన్ స్పష్టం చేశారు. కులాలను కలపాలన్నదే తన అభిమతమన్న ఆయన .. పులివెందులతో సహా రాష్ట్రవ్యాప్తంగా తనకు అభిమానులు వున్నారని జనసేనాని తెలిపారు. ఎంతోమంది పార్టీలు పెట్టి తట్టుకోలేక వదిశారని ఆయన గుర్తుచేశారు. ఎవరైనా గెలిచేకొద్దీ బలపడతారని.. కానీ మనం డెబ్బపడేకొద్ది బలపడుతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లుతున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. కులం పేరుతో కొట్లాడితే సమాజం విచ్ఛిన్నమవుతుందని ఆయన స్పస్టం చేశారు. ప్రతీ చోట కనీసం 500 మంది జనసేన కార్యకర్తలున్నారని పవన్ తెలిపారు.
సమాన ప్రాతినిథ్యం కావాలంటే జనసేన అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. కులాన్ని అమ్మేస్తానని అంటుంటే బాధగా వుందన్నారు. రాష్ట్రంలో ఒక కులం పెత్తనం ఆగిపోవాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ప్రభుత్వం దగ్గర దేహీ అంటున్నామంటే.. కులాల మధ్య ఐక్యత లేకపోవడమే కారణమని ఆయన అన్నారు. అగ్రకులాల్లో వున్న పేదల గురించి కూడా ఆలోచించాలని పవన్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు , మంత్రులకు దోచుకోవడానికి డబ్బుంది కానీ స్కాలర్‌షిప్‌లు ఇవ్వడానికి డబ్బు లేదని ఆయన దుయ్యబట్టారు. జనసేనకు మీరు అండగా వుంటే మీకు మేం అండగా నిలబడతామన్నారు. ప్రతీ కులం మాకు రిజర్వేషన్ కావాలంటోందని.. వైసీపీ కుల కార్పోరేషన్‌లను ఏర్పాటు చేసిందని ఆయన ఎద్దేవా చేశారు.