ప్రధానికి ఫిర్యాదు చేస్తా: జగన్ కు పవన్ కళ్యాణ్ వార్నింగ్

By Nagaraju penumalaFirst Published Oct 25, 2019, 1:30 PM IST
Highlights

జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 486పై ప్రధాని నరేంద్రమోదీకి, హోం శాఖ మంత్రి అమిత్ షాకి, జీఎస్టీ కౌన్సిల్, ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులకు భంగం కలిగేలా స్వప్రయోజనాల కోసం నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నారంటూ మండిపడ్డారు.

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 486పై ప్రధాని నరేంద్రమోదీకి, హోం శాఖ మంత్రి అమిత్ షాకి, జీఎస్టీ కౌన్సిల్, ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. 

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులకు భంగం కలిగేలా స్వప్రయోజనాల కోసం నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నారంటూ మండిపడ్డారు. జగన్ సర్కార్ విడుదల చేసిన జీవో నంబర్ 486ని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తే కేంద్రం విడుదల చేసే నిధుల విషయంలో రాష్ట్రాలు దీర్ఘకాలికంగా నష్టపోతాయని హెచ్చరించారు. 

ఇసుక కొరత సమస్యపై లారీ యజమానులు, లారీ డ్రైవర్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ తో చర్చించారు. ఇసుక కొరత వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్పష్టం చేశారు. 

లారీ యజమానులు, లారీ డ్రైవర్ల సమస్యలు విన్న పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల సుమారు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని పవన్ ఆరోపించారు.  

కనీసం బియ్యం తెచ్చుకునేందుకు కూడా డబ్బులు లేని దుస్థితిలో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలను పోషించుకునే పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికులు ఉండటం దురదృష్టకరమన్నారు. 

పదిమందికి పని కల్పించే మేస్త్రీ కూడా ఈరోజు తినడానికి తిండి లేకుండా నానా పాట్లు పడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఐదు నెలల నుంచి ఇసుక విధానంపై అధ్యయనం చేస్తున్నామంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. 

తెలుగుదేశం పార్టీ చేసిన తప్పిదాలను సరిచేసే క్రమంలో అసలు ఇసుకకే ఎసరు తెచ్చింది వైసీపీ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. కొండనాలుకకు ముందేస్తే ఉన్న నాలుక విధానంగా ప్రభుత్వ పరిస్థితి ఉందని మండిపడ్డారు. 

నూతన ఇసుక విధానం లోపభూయిష్టంగా ఉన్నాయని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం ఇసుక విధానంపై క్లారిటీ ఇవ్వాలని నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల మంది లారీ ఓనర్లు ఆధారపడి బతుకుతున్నారని పవన్ చెప్పుకొచ్చారు. 

కృష్ణా జిల్లాలో 6వేల లారీలు ప్రత్యేకించి ఇసుక తరలింపుపైనే ఆధారపడి బతుకీడుస్తున్నారని పవన్ చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వం మరో 6వేల లారీలను అందజేయనున్నట్లు జీవో విడుదల చేసిందని చెప్పుకొచ్చారు. 

అయితే ఉన్నలారీలకు అదనంగా లారీలు ఇస్తే తాము స్వాగతిస్తామని కానీ ఉన్న ఆరువేల లారీలను తొలగించి కొత్త లారీలు అనుమతి అంటే తాము అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఉన్న ఉద్యోగాలకు అదనంగా ఉద్యోగాలు కల్పించాలే తప్ప ఉన్న ఉద్యోగాలు తీసేసి కొత్త ఉద్యోగాలు ఇవ్వడం సరికాదన్నారు. 
 
అంతేకాకుండా నూతనంగా ఇచ్చే లారీలకు సంబంధించి జీఎస్టీ తక్కువ కట్టేలా చట్టం తీసుకువచ్చారని అది కేంద్రప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కడమేనన్నారు. జీఎస్టీ తగ్గించేలా చేయడానికి మీరెవరంటూ ప్రశ్నించారు. జీఎస్టీ తగ్గింపు అనేది కేంద్రం జీఎస్టీ, కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయాలని చెప్పుకొచ్చారు.  

జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 486పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీకి, జీఎస్టీ కౌన్సిల్, అమిత్ షాకి జీవోను పంపించనున్నట్లు తెలిపారు. అలాగే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ తో నాకు గొడవలు లేవు... పవన్ షాకింగ్ కామెంట్స్

పవన్ కి మరో షాక్... పార్టీని వీడుతున్న కీలక నేత

సీబీఐ కేసులున్న జగన్ కేంద్రంతో..... పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

click me!