క్వారీ ప్రమాదం: పవన్ దిగ్బ్రాంతి.. బాధితులకు ప్రభుత్వోద్యోగం, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్

By Siva KodatiFirst Published May 8, 2021, 4:23 PM IST
Highlights

కడప జిల్లా మామిళ్లపల్లెలోని ముగ్గురాయి క్వారీలో జరిగిన పేలుడులో 10 మంది మరణించిన సంగతి తెలిసిందే . ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిలిటెన్ స్టిక్స్ పేలి 10 మంది మృత్యువాత పడ్డారనే వార్త హృదయాన్ని కలచివేసిందన్నారు

కడప జిల్లా మామిళ్లపల్లెలోని ముగ్గురాయి క్వారీలో జరిగిన పేలుడులో 10 మంది మరణించిన సంగతి తెలిసిందే . ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిలిటెన్ స్టిక్స్ పేలి 10 మంది మృత్యువాత పడ్డారనే వార్త హృదయాన్ని కలచివేసిందన్నారు.

ఈ విషాదకర ఘటనలో చనిపోయినవారిని గుర్తించలేని పరిస్థితి ఉందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని బట్టే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన జనసేనాని.. ప్రభుత్వం తక్షణమే మృతుల కుటుంబాలకు పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని... ప్రమాదానికి కారణమైన గని యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  

Also Read:ముగ్గురాయి గనుల్లో పేలుడు : ముఖ్యమంత్రి వైయస్ జగన్ దిగ్భ్రాంతి...

అంతకుముందు క్వారీలో జరిగిన పేలుడు ఘటనలో పలువురు దుర్మరణం చెందటం పట్ల ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పేలుడు ఘటన జరగటానికి గల కారణాలను ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కాగా, శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ  భారీ పేలుడులో పది మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. పేలుడు పదార్థాల బ్లాస్టింగ్ లో ఈ దుర్ఘటన జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లి ముగ్గురాళ్ల గనిలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాల క్రషర్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ముగ్గురాయిని వెలికి తీసేందుకు కూలీలు వెళ్లారు. ఆ సమయంలో పేలుడు సంభవించింది.
 

click me!