జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జనసేన నేత సాయిపై దాడి చేసిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్‌పై పవన్ కల్యాణ్ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జనసేన నేత సాయిపై దాడి చేసిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్‌పై పవన్ కల్యాణ్ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా ఉన్న తమ పార్టీ నాయకుడిపై దాడి చేసిన సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. తిరుపతి ఎస్పీని కలిసిన వారిలో పవన్ కల్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్, కొందరు జనసేన ముఖ్య నేతలు ఉన్నారు. దాదాపు 20 నిమిషాల పాటు పవన్ ఎస్పీ కార్యాలయంలో ఉన్నారు. అనంతరం పవన్ అక్కడి నుంచి బయటకు వచ్చారు.
ఇక, పవన్ రాక నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం వద్దకు భారీగా జనసేన నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో పవన్ వారందరికీ అభివాదం చేశారు. ఇదిలాఉంటే, సీఐ అంజూ యాదవ్‌పై చర్యలు తీసుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు సిద్దం అవుతున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. జనసేన నేతపై సీఐ అంజూ యాదవ్ దాడి ఘటనకు సంబంధించి కూడా పోలీసు ఉన్నతాధికారులు అధికారికంగా స్పందించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఇక, ఈరోజు ఉదయం విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కల్యాణ్‌కు జనసైనికులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, పార్టీ నేతలు చిలకం మధుసూదన్ రెడ్డి, రణ్ రాయల్ తదితరులు పవన్‌కు స్వాగతం పలికినవారిలో ఉన్నారు. అక్కడి నుంచి పార్టీ నాయకులు, జనసైనికులతో కలసి భారీ ర్యాలీగా పవన్ కళ్యాణ్ గారు తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు.
ఇక, ఇదివరకే ఈ ఘటనపై స్పందించిన పవన్ కల్యాణ్.. శాంతియుతంగా ధర్నా చేయడం ప్రజాస్వామ్యంలో హక్కు అని పేర్కొన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్నవారిని కొట్టే హక్కు ఏ పోలీసు అధికారికి లేదని అన్నారు. తానే శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లాకు వస్తానని.. అక్కడే తేల్చుకుందామని అన్నారు. తమ వాళ్లను ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. తమ నాయకుడిని కొడితే.. తనను కొట్టినట్టేనని తప్పకుండా అక్కడికే వస్తానని చెప్పారు. పోరాడితే పోయేదేమి లేదు.. బానిస సంకెళ్లు తప్ప అని పవన్ పేర్కొన్నారు.
శాంతియుతంగా ఉన్న తమ పార్టీ నాయకుడిపై దాడి చేసిన సీఐపై చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ ద్వారా పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ)కి ఫిర్యాదు చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇది వరకే ప్రకటించారు.