పోలవరం కోసం త్యాగాలు చేశారు.. కాస్త గౌరవించండి జగన్ గారు: పవన్

Siva Kodati |  
Published : Mar 26, 2021, 07:55 PM IST
పోలవరం కోసం త్యాగాలు చేశారు.. కాస్త గౌరవించండి జగన్ గారు: పవన్

సారాంశం

ఏపీకి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారిపట్ల ప్రతి ఒక్కరూ కృతజ్ఞతాభావం కలిగి ఉండాలన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్. ఈ విషయాన్ని పాలకులు విస్మరించి ముంపు ప్రాంతవాసుల పట్ల అనుసరిస్తున్న వైఖరి బాధ కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు

ఏపీకి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారిపట్ల ప్రతి ఒక్కరూ కృతజ్ఞతాభావం కలిగి ఉండాలన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్. ఈ విషయాన్ని పాలకులు విస్మరించి ముంపు ప్రాంతవాసుల పట్ల అనుసరిస్తున్న వైఖరి బాధ కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. పోలవరం ముంపు ప్రాంత పరిధిలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో అధికార యంత్రాంగం అనుసరించిన దుందుడుకు విధానాలను పవన్ ఖండించారు.

జేసీబీలతో ఇళ్లను కూల్చివేసి విద్యుత్‌ సరఫరా సహా ఇతర సదుపాయాలను నిలిపివేయడం దారుణమన్నారు. పుట్టి పెరిగిన ఊళ్లను, జీవనోపాధిని, సాగుభూమిని వదిలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న గిరిజనులపై ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం సరికాదని పవన్ మండిపడ్డారు.

కచ్చితంగా ఇది మానవహక్కుల ఉల్లంఘనేనని జనసేనాని ధ్వజమెత్తారు. జనసేన నేత ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆధ్వర్యంలో జనసేన బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటించి నిర్వాసితులతో మాట్లాడినట్లు ఈ సందర్భంగా పవన్ గుర్తుచేశారు.

కంటి తుడుపు కోసం నిర్వాసితులకు పట్టాలు ఇచ్చి ఊరి నుంచి పంపిస్తే వాళ్లు ఎక్కడ తలదాచుకోవాలని జగన్ ప్రభుత్వాన్ని పవన్‌ ప్రశ్నించారు. నిర్వాసితుల కోసం కాలనీలు నిర్మించి అన్ని సదుపాయాలు కల్పించాలని.. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడినీ పరిహారం ప్యాకేజీకి అర్హులుగా ప్రకటించాలని జనసేనాని డిమాండ్ చేశారు.

పోలవరం ముంపు బాధితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద రూ.10 లక్షలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన జగన్‌.. ఇప్పుడు రూ.6.8 లక్షలే ఇస్తున్నారని పవన్ మండిపడ్డారు.  

పోలవరం నిర్వాసితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, ప్రజల కష్టాలను జాతీయ మానవహక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగాలు చేస్తున్నవారికి అండగా నిలుస్తామని జనసేనాని హామీ ఇచ్చారు.  

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!