
కాపులు కులాన్ని దాటి ఆలోచించాలని.. రెల్లి కులం కోసం ఆలోచించే తనను కాపు సామాజిక వర్గం దూరం పెడుతోందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను పుట్టిన కులం వెనుకబాటుతనం గురించి కూడా ఆలోచిస్తానని ఆయన స్పష్టం చేశారు. మీరు ఓటేస్తే సీఎంను అయి చూపిస్తానని.. జగన్ కాపులకే భయపడతాడని పవన్ పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గంలో ఐక్యత లేదని.. యువతకు సరైన ఉపాధి వుంటే గంజాయి వైపు వెళ్లరని ఆయన అన్నారు. తాము ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో.. తమ బలమేంటో తమకు తెలుసునని పవన్ తెలిపారు. విశాఖ అల్రెడీ అభివృద్ధి చెందిందని.. అక్కడ రాజధాని అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాపులు ఎదగాలంటే ఎవరితోనూ గొడవ పడాల్సిన అవసరం లేదని.. దళిత, ముస్లిం వర్గాలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని పవన్ స్పష్టం చేశారు. కాపులు నడుం బిగిస్తే అందరికీ మంచి జరుగుతుందని.. అన్ని పదవులు ఒకే కులానికి ఇవ్వడం సరికాదని ఆయన అన్నారు. గ్లోబెల్స్ ప్రచారాలు ఆపకుంటే వైసీపీ నేతలు దిక్కులేని చావు చస్తారని పవన్ హెచ్చరించారు.
రంగాకి తన చిన్నతనంలో టీ కూడా తీసుకెళ్లి ఇచ్చానని పవన్ గుర్తుచేశారు. రంగా భార్య కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తని ఆయన చెప్పారు. కాపు యువతలో పరివర్తన రావాలని పవన్ పిలుపునిచ్చారు. కమ్మ సామాజిక వర్గానికి తాను దాసుడినంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అన్ని కులాల్లోనూ అభిమానులు వున్నారని పవన్ తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇంకా కులం కులం అని కొట్టుకుని చస్తున్నామన్నారు. కాపులంతా ఓట్లు వేసుంటే తాను తప్పకుండా గెలిచేవాడినని పవన్ స్పష్టం చేశారు. రంగాను చంపేస్తుంటే ఆయనను కాపాడుకోలేని వారు ఇప్పుడు విగ్రహాలు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. భాష, యాసలకు జనసేన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మహానుభావుడు అయితే తాను అస్త్రసన్యాసం చేస్తానని పవన్ స్పష్టం చేశారు. కులాన్ని చూసి కాకుండా గుణం చూసి ఓట్లు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.
బీజేపీతో పొత్తు అంటే ముస్లింలు తనను వదిలేస్తున్నానరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆజాన్ వినిపిస్తే తన మీటింగ్ ఆపేస్తానని పవన్ గుర్తుచేశారు. జగన్ ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తారో తనకు తెలుసునని.. కేంద్రంలో ఏ పార్టీ వుంటే ఆ పార్టీకి జగన్ మద్ధతు ఇస్తారని జనసేనాని స్పష్టం చేశారు. ముస్లిం సమాజంపై ఎవరూ వేలు పెట్టినా తాట తీస్తామని పవన్ హామీ ఇచ్చారు. తాను బీజేపీతో వున్నన్ని రోజులూ ముస్లింలపై దాడి జరిగితే పొత్తు నుంచి బయటకు వస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బెదిరించడానికి , సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టడానికి చిన్నపిల్లలు కాదు కానీ.. సీసీఎస్ హామీ నెరవేర్చడానికి కాదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతుంటే మీకు కోపం రావడం లేదా అని ప్రజలను నిలదీశారు. రామతీర్థం, పీఠాపురంలలో ఆలయాలు ధ్వంసం అయితే ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.