
హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం హింసను ప్రేరేపిస్తూ పాలన సాగిస్తోందంటూ జనసేనాని పవన్ కల్యాణ్ నేడు మౌన దీక్ష చేపట్టారు. గాంధీజీ అహింసా వాదానికి మద్దతుగా మచిలీపట్నంలోని సువర్ణ కల్యాణ మండపంలో పవన్ మౌనదీక్షకు కూర్చున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన పవన్... ఆయన అహింసా మార్గంలో ప్రతిఒక్కరు నడవాలన్నారు. పవన్‌కు సంఘీభావంగా పలువురు జనసేన నేతలు ఈ దీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... ప్రజాసేవ కోసం రాజకీయాలు చేసేవారికి కక్షలు వుండవని... అందుకు జాతిపిత గాందీజి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయులే నిదర్శనమన్నారు. గాంధీజీ, అంబేద్కర్ మద్య బేదాభిప్రాయాలు వుండేవని... కానీ ఏనాడూ ఒకరిపై ఒకరు కక్ష పెంచుకోలేదని అన్నారు. వాళ్లు కూడా మన సీఎం జగన్ రెడ్డి లాగే ఆలోచించివుంటే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడేదన్నారు. బాధ్యతగా ఆలోచించారు కాబట్టే ఒకరు మహాత్ముడు... మరొకరు రాజ్యాంగ నిర్మాత అయ్యారని పవన్ పేర్కొన్నారు.
వీడియో
రాజకీయాల్లో పార్టీలు, నాయకుల మధ్య బేదాభిప్రాయాలు వుండటం సహజం... కానీ అది వ్యక్తిగత కక్షలకు దారితీయకూడదని పవన్ అన్నారు. కానీ ప్రస్తుతం మహాత్ములు చూపిన బాటలో కాకుండా కక్షా రాజకీయాలకు సీఎం జగన్ తెరతీసారని అన్నారు. జగన్ లాగా ప్రత్యర్థి నాయకులపై కేసులు పెట్టి, జైళ్లకు పంపే ఆలోచన ఆనాటి మహనీయులు చేయలేదన్నారు. ఎన్ని అభిప్రాయ బేధాలున్నా అంబేద్కర్ మేదస్సును గుర్తించి గాంధీజి అనేక అవకాశాలు ఇచ్చారని పవన్ పేర్కొన్నారు.
Read More ఏపీలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ మౌన దీక్ష..
సీఎం జగన్ పై తనకు వ్యక్తిగత ద్వేషమేమీ లేదని... ఆయన అరాచక పాలన, నిర్ణయాలనే వ్యతిరేకిస్తున్నానని పవన్ అన్నారు. గాంధీజీ కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని వైసిపి ప్రభుత్వం చంపేసిందని అన్నారు. గాంధీజీలా అహింసా మార్గంలో నడవడం నేటి రాజకీయాల్లో సాధ్యంకాదని అన్నారు. సమకాలీన రాజకీయ నాయకులకు బ్రిటిష్ వాళ్లకు ఉన్న సంయమనం లేదన్నారు. మన నాయకుల కన్నా బ్రిటిష్ వారే కొంచెం ఆలోచించే వాళ్లని పవన్ వ్యాఖ్యానించారు.
దేశ అవసరాల కోసం ఎవరితో అయినా కలిసే స్వేచ్ఛ ఉందని పవన్ తెలిపారు. వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని జనసైనికులకు పవన్ సూచించారు. బురదలో నుంచి కమలం వచ్చినట్లు... కలుషితమైన రాజకీయాల్లో నుంచి జనసేన కమలం వికసిస్తుందన్నారు. రాజకీయాల్లో బురద పడుతుందని తెలుసు.. అయినా ముందుకే సాగుతానని పేర్కొన్నారు. 2024 ఎన్నికల తరువాత జనసేన అధికారంలో వస్తుందని... అప్పుడు గాంధీ జయంతిని బందరులో చేసుకుందామని పవన్ పేర్కొన్నారు.