చిరంజీవి కచ్చితంగా సీఎం అయ్యుండేవారు: పవన్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Dec 3, 2020, 9:31 PM IST
Highlights

ప్రజారాజ్యం పార్టీ స్థాపన, చిరంజీవి ఓటమి, కాంగ్రెస్‌లో విలీనం వంటి జ్ఞాపకాలు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను అనుక్షణం వెంటాడుతూనే వుంటాయి

ప్రజారాజ్యం పార్టీ స్థాపన, చిరంజీవి ఓటమి, కాంగ్రెస్‌లో విలీనం వంటి జ్ఞాపకాలు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను అనుక్షణం వెంటాడుతూనే వుంటాయి. తాజాగా మరోసారి నాటి సంఘటలను గుర్తుచేసుకున్నారు.

చిరంజీవి ఇప్పటికీ రాజకీయాల్లో ఉండి ఉంటే.. ఇప్పుడు ముఖ్యమంత్రి అయి ఉండేవారని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆశయ బలం ఉన్న వారికి ఓటమి కుంగుబాటును ఇవ్వదన్నారు.

అధికారం మనకు బాధ్యత, అలంకారం కాదని.. అజమాయిషీ చేయటానికి అధికారం అని ఇప్పుడు అనుకుంటున్నారని పవన్ వ్యాఖ్యానించారు. వైసీపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని.. భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని హితవు పలికారు.

సిమెంటు ఫ్యాక్టరీ కోసమో, ఇసుక అమ్ముకోవటానికో, మద్యం అమ్ముకోవటానికో తాను సీఎం అవ్వాలనుకోలేదని పవన్ స్పష్టం చేశారు. పవన్ సెల్ఫీ తీసుకోకపోతే ఓటు వేయనని తనను బెదిరించవద్దని... తాను మీ కోసం వచ్చానని జనసేనాని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

తనను పని చేసుకోనివ్వాలని...  ఫొటో తీసుకోలేదని తనపైన కోపం చూపించవద్దని పవన్ పేర్కొన్నారు. మిగిలిన వారు 25 కేజీలు బియ్యం ఇవ్వాలని చూస్తున్నారని.. తాను 25 సంవత్సరాల భవిష్యత్తును ఇవ్వాలని చూస్తున్నాని చెప్పారు.

రైతు విలువ తెలియాలంటే ప్రతి ఒక్కరు ఒక గింజను నాటి మొక్కను సంరక్షించి చూపించాలని పవన్ కల్యాణ్ వెల్లడించారు. రైతుల కోసం, అమరావతి రైతు కోసం లాఠీలు విరిగినా ముందుకు వెళ్లటానికి సిద్ధంగా ఉన్నానని జనసేనాని స్పష్టం చేశారు.

రైతు కోసం, కౌలు రైతు కోసం జై కిసాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని.. ఇందుకు సంబంధించిన కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని పవన్ వెల్లడించారు. మిగిలిన రాజకీయ నేతల్లా తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు,  మీడియా సంస్థలు లేవని అందుకే సినిమాల్లో నటిస్తున్నాను జనసేనాని వ్యాఖ్యానించారు. 

click me!