బీజేపీకి దగ్గరే .. దూరమయ్యానని ఎవరు చెప్పారు: పవన్ కీలక వ్యాఖ్యలు

By sivanagaprasad KodatiFirst Published Dec 4, 2019, 1:09 PM IST
Highlights

తాను బీజేపీకి ఎప్పుడూ దూరంగా లేనన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తిరుపతిలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజల కోసమే బీజేపీతో విభేదించానే కానీ ఆ పార్టీతో దూరంగా లేనని జనసేనాని స్పష్టం చేశారు

తాను బీజేపీకి ఎప్పుడూ దూరంగా లేనన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తిరుపతిలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజల కోసమే బీజేపీతో విభేదించానే కానీ ఆ పార్టీతో దూరంగా లేనని జనసేనాని స్పష్టం చేశారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అంటే తనకు గౌరవమని, వైసీపీ నేతలకు భయమని పవన్ సెటైర్లు వేశారు.

జగన్ నివాసానికి కూతవేటు దూరంలో కృష్ణా పుష్కర ఘాట్ వద్ద సామూహిక మత మార్పిడి జరిగితే ప్రభుత్వానికి కనిపించలేదా అని పవన్ ప్రశ్నించారు. ఎవరి అండతో మత మార్పిడులు జరుగుతున్నాయని.. హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన దేవాదాయ శాఖ కానీ, ప్రజాప్రతినిధులు కానీ దీనిపై స్పందించలేదని పవన్ విమర్శించారు.

Also Read:జగన్ ఇంటికి సమీపంలోనే సామూహిక మత మార్పిడులు: పవన్ తీవ్ర వ్యాఖ్యలు

హిందూ ధర్మానికి దెబ్బ తగులుతుంటే మిగిలిన పార్టీలు సైతం స్పందించడం లేదని.. మిగిలిన మతాల ఓట్లు పోతాయనే వారు మాట్లాడటం లేదని జనసేనాని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం ఒకవేళ మత మార్పిడులపై స్పందించకుంటే ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్తుందని పవన్ తెలిపారు.

వైసీపీ నేతలు భాషను మార్చుకోవాలని పవన్ కల్యాణ్ హితవు పలికారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందని స్థానికులు వాపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

రాయలసీమ యువత మార్పును కోరుకుంటోందని.. తెలుగు భాషను పరిరక్షించండి అంటే వైసీపీ వక్రీకరిస్తోందని జనసేనాని ఆరోపించారు. ఇంగ్లీష్ మీడియం అవసరమే కానీ.. తెలుగు మీడియం లేకుండా చేస్తే ఎలా అని పవన్ ప్రశ్నించారు.

తెలుగు మీడియం తీసుకునే అవకాశం ఉండాలని.. ఉర్దూ మీడియంను కూడా తీసేసి ఇంగ్లీష్ మీడియంను ప్రోత్సహిస్తారా అని పవన్ దుయ్యబట్టారు. ప్రభుత్వం కూల్చివేతలపైనే దృష్టి పెట్టిందని.. ఇంగ్లీష్ మీడియానికి తాను వ్యతిరేకం కాదని, కొంతమంది తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన గుర్తు చేశారు.

151 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా ఉల్లి ధరలు తగ్గించలేకపోయారని, ప్రజలకు మాణిక్యాలు అవసరం లేదని.. నిత్యావసరాలు ఇస్తే చాలని పవన్ హితవు పలికారు. యురేనియం మైనింగ్ కారణంగా కడప జిల్లా తుమ్మలపల్లి ప్రాంతంలోని ప్రజలకు అనేక జబ్బులు వచ్చాయని పవన్ గుర్తుచేశారు. 

Also read:నేను మోదీతో చేతులు కలిపితే జగన్ సీఎం అయ్యేవాడా, వైసీపీ ఉండేదా: పవన్ కళ్యాణ్

ఉల్లిగడ్డలు కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, గత ప్రభుత్వ ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించడంతోనే సమయం అంతా వృథా చేస్తున్నారని పవన్ ఎద్దేవా చేశారు. కేజీ ఉల్లిపాయల కోసం 7 నుంచి 8 గంటలు క్యూలో నిలబడాలా అని పవన్ ప్రశ్నించారు.

click me!