
హైదరాబాద్: తమ పార్టీ ప్రముఖ వ్యూహకర్తగా దేవ్ వ్యవహరిస్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన వెంటనే ఎవరీ దేవ్ అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. పవన్ కల్యాణ్ ఏరికోరి తన జట్టును ఎంపిక చేసుకుంటారనే అభిప్రాయం ఉండడం ఆసక్తి కారణం. పైగా, దేవ్ గురించి పవన్ కల్యాణ్ చాలా ఎక్కువే చెప్పారు.
దేవ్ తనకు చెందిన 1200 ఎసిఎఫ్ ఆర్గనైజర్లతో కలిసి పనిచేస్తారని, పార్టీ వ్యూహాలు రచిస్తారని, పార్టీ కార్యక్రమాలను ఖరారు చేస్తారని పవన్ కల్యాణ్ చెప్పారు. పలు పార్టీలకు దేవ్ పనిచేశారని, పలు సర్వేలు కూడా నిర్వహించారని ఆయన అనుభవం గురించి చెప్పారు.
అయితే, దేవ్ నియామకం జరిగిన కొద్ది సేపటికే దేవ్ కు సంబంధించిన పూర్వ చరిత్రను తవ్వి నెటిజన్లు సోషల్ మీడియాలో సందడి చేశారు. ఆయన బిజెపి నుంచి వచ్చారనే ప్రచారం ఊపందుకుంది. దేవ్ అసలు పేరు వాసుదేవ్.
బిజెపిలో ఆయన చురుగ్గా పనిచేసినట్లు చెప్పే వీడియోలు, పోస్టర్లు బయటకు వచ్చాయి. బిజెపి శాసనసభ్యుడు కిషన్ రెడ్డితో కలిసి దిగిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి.
తమ వ్యూహకర్తగా పవన్ కల్యాణ్ పరిచయం చేసినప్పుడు దేవ్ తన ప్రసంగాన్ని ఆంగ్ల భాషలోనే కొనసాగించారు. కానీ ఆయనకు తెలుగు చాలా బాగా వచ్చునని చెబుతున్నారు. తెలుగులో అనర్గళంగా ప్రసంగించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
దేవ్ హఠాత్తుగా జనసేన వేదికపై కనిపించేసరికి బిజెపి నాయకులు కూడా విస్తుపోయినట్లు ప్రచారం సాగుతోంది. దీన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న మీడియా కూడా ఓ ఆయుధంగా వాడుకున్నట్లు అర్థమవుతోంది.