రాష్ట్రంలో మంత్రులకు తమ శాఖలపై పట్టుందా అని జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
అమరావతి: రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను జగన్ సర్కార్ నాశనం చేసిందని జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.సోమవారం నాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుతో రాష్ట్రానికి ఓరిగేదేమీ లేదని నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కడప స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. జిందాల్ సంస్థకు కేటాయింపులపై ఎందుకు వాస్తవాలు వెల్లడించలేదో చెప్పాలన్నారు.
కేసులు పెట్టి భయపెడుతుంటే ఎవరైనా రాష్గ్రంలో పెట్టుబడులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. ఏపీలో మంత్రులకు తమ శాఖలపై పట్టుందా అని నాదెండ్ల మనోహర్ అడిగారు. 2024 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే రాష్ట్రంలో ఎన్నికల వేడి ఇప్పటికే రాజుకుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. అయితే ఇందుకు బలం చేకూర్చేలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల ు ఇటీవల కాలంలో రెండు దఫాలు సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీని అధికారంలోకి రాకుండా చూస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకుగాను విపక్ష పార్టీలన్నీ ఉమ్మడిగా పోటీ చేయాల్సిన అవసరం ఉందని జనసేన చెబుతుంది. ఈ దిశగా తమ పార్టీ చర్చలు నిర్వహించనుందని ఆ పార్టీ నేతలు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.