
అప్పటి వరకు అందరూ కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత అంతలోనే రూ.100 కోసం వారి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్త చివరకు హత్యకు దారి తీసింది. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వాంబేకాలనీ ప్రాంతానికి చెందిన సెంట్రింగ్ మేస్త్రీ షేక్ రఫీ వద్ద అదే ప్రాంతానికి చెందిన యడ్లవల్లి నాగరాజు అలియాస్ పండు(27) సెంట్రింగ్ పనులకు వెళ్తుంటాడు. ఖర్చుల కోసం రూ.100 ఇవ్వాలని రఫీని పండు రెండు రోజులుగా అడుగుతున్నాడు. ఇదే విషయమై గురువారం సాయంత్రం రఫీ ఇంటి వద్ద వీరిద్దరూ గొడవపడటంతో పెద్దలు సర్దుబాటు చేసి పంపేశారు. శుక్రవారం ఉదయం 10గంటల సమయంలో పండును రఫీ ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లాడు.
రాజీవ్‌నగర్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ షేక్ హుసేన్, మరో సెంట్రింగ్ కార్మికుడు కిశోర్‌తో కలసి వీరిద్దరూ పైపులరోడ్డు సెంటర్ సమీపంలోని దుర్గా బార్‌లో మద్యం తాగారు. అక్కడినుంచి వెళ్లిపోయిన గంట తర్వాత మళ్లీ కలిశారు. నున్న రూరల్ పోలీసు స్టేషన్ సరిహద్దు ప్రాంతంలో బైక్‌లు పెట్టి దుర్గాబార్ పక్క రోడ్డులో గొడవ పడ్డారు.
పండును హుసేన్, కిశోర్ పట్టుకోగా రఫీ కత్తితో పొడిచి చంపాడు. ఈ కొట్లాటలో నిందితులు ముగ్గురికీ గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సీఐ లక్ష్మీనారాయణ వెంటనే సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న పండును, గాయాలపాలైన రఫీ, హుసేన్, కిశోర్‌ను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే పండు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మిగిలిన ముగ్గురికీ చికిత్స అందిస్తున్నారు. పండును అంతమొందించే ఉద్దేశంతోనే రఫీ ఉదయం నుంచి వెంటబెట్టుకొని తిరుగుతూ స్నేహితుల సహాయంతో హత్య చేశాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం.