కాంగ్రెస్ తో చంద్రబాబు: జగన్ కు నష్టం, పవన్ కల్యాణ్ కు జోష్

By pratap reddyFirst Published Nov 4, 2018, 10:38 AM IST
Highlights

జాతీయ, రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా రాజకీయ అనివార్యతతో కాంగ్రెసుతో కలుస్తున్నామని టీడీపి అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలంగాణలో ప్రధాన భాగస్వామిగా ఉన్న కాంగ్రెసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనర్ పార్ట్నర్ గా ఉండే అవకాశాలున్నాయి. 

అమరావతి: కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెట్టుకునే అవకాశం ఉంది. 

జాతీయ, రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా రాజకీయ అనివార్యతతో కాంగ్రెసుతో కలుస్తున్నామని టీడీపి అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలంగాణలో ప్రధాన భాగస్వామిగా ఉన్న కాంగ్రెసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనర్ పార్ట్నర్ గా ఉండే అవకాశాలున్నాయి. 

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు ఘోరంగా దెబ్బ తిన్నది. ఈ స్థితిలో కాంగ్రెసు ఓటు బ్యాంకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి మళ్లిందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా దళిత ఓటర్లు వైఎస్సార్ వైపు ఉన్నారని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవడం వల్ల వైసిపి దళిత ఓటు బ్యాంకు చీలుతుందని ఆయన అనుకుంటున్నారు. 

1982లో టీడీపి ఆవిర్భావం నుంచి కాంగ్రెసును రాజకీయ ప్రత్యర్థిగా చూస్తూ వస్తోంది. తొలిసారి కాంగ్రెసు, టీడీపిల మధ్య పొత్తు పొడిచింది. కాంగ్రెసుకు ప్రస్తుతం ఎపిలో పెద్దగా ఓటు బ్యాంకు లేనప్పటికీ ఇరు పార్టీల మధ్య పొత్తు వల్ల దళితులు పునరాలోచనలో పడుతారని అనుకుంటున్నారు. అయితే, కాంగ్రెసు పార్టీ నుంచి నాయకులు ఇతర పార్టీల బాట పడుతున్న నేపథ్యంలో చంద్రబాబు అంచనాలు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయనేది ఇప్పుడే చెప్పలేం.

ఇది ఇలా ఉంటే, చంద్రబాబు కాంగ్రెసుతో కలవడం తమకు కలిసి వస్తుందని పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన అభిప్రాయపడుతోంది. చంద్రబాబుపై, ఆయన ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఇటీవల ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకునే అవకాశం ఉంది. 

చంద్రబాబు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారనే విమర్శను ప్రజల్లోకి ఆయన విస్తృతంగా తీసుకుని వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెసుతో టీడీపి కలవడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీర్ణించుకోలేరని కూడా జనసేన నాయకులు భావిస్తున్నారు.  

click me!