
కాకినాడ:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో పవన్ కళ్యాణ్ బాధపడుతున్నారని జనసేన వర్గాలు తెలిపాయి. అస్వస్థతగా ఉన్నప్పటికి ముందుగా ప్రకటించిన షెడ్యూల్ మేరకు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికల ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం నాడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి హైద్రాబాద్ కు చేరుకున్నారు. సోమవారం నాడు పిఠాపురం చేరుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి.ఈ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇప్పటికే 19 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాల్లో అభ్యర్ధులను జనసేన ప్రకటించింది. మిగిలిన రెండు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను త్వరలోనే ఆ పార్టీ ప్రకటించనుంది.
2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ దఫా మాత్రం పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగారు. గతంలో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాలతో పిఠాపురం నుండి పోటీ చేయలేకపోయినట్టుగా పవన్ కళ్యాణ్ ఇటీవలనే ప్రకటించిన విషయం తెలిసిందే.