
హైదరాబాద్: కందుకూరు, గుంటూరు లలో తొక్కిసలాటకు పోలీసుల వైఫల్యమే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. పోలీసులు నిస్తేజంగా ఉంటే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు తో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరులో చంద్రబాబునాయుడు వెళ్లిపోయిన తర్వాత సంక్రాంతి కానుక కిట్స్ కోసం ప్రజలు ఎందుకు ఎగబడ్డారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తే ప్రజలు ఎందుకు గుంటూరులో సంక్రాంతి కిట్స్ కోసం అంత పెద్ద ఎత్తున ఎందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందడం లేదని ఈ ఘటనతో అర్ధమౌతుందన్నారు. జీవో నెంబర్ 1 అందరికి వర్తిస్తుందని వైసీపీ నేతలు చెబుతున్న మాటలను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నట్టుగా ప్రభుత్వం చేసిన ప్రకటనను ఆయన గుర్తు చేశారు. కానీ జగన్ పుట్టిన రోజున పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ యంత్రాగం వారి చేతుల్లోనే ఉందన్నారు.. ఈ జీవోలు విపక్షాల సభలను అడ్డుకోవడం కోసమేనని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
ప్రతిపక్షాల మాటలను ప్రజలు వినకూడదనే భావనతో ప్రభుత్వం జీవో 1 ను తీసుకు వచ్చిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. తమ పార్టీకి చెందిన జనవాణి కార్యక్రమం జరగకుండా అడ్డుకున్నారని చెప్పారు. తమ సభలకు భద్రతను కల్పించడం పోలీసుల బాధ్యత అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఫలానా చోట సభలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ సభకు ఇంత మంది జనం వస్తున్నారని పోలీసుల అనుమతి కోరుతామన్నారు. ఈ సభలకు పోలీసులు భద్రత కల్పించాలన్నారు. కానీ ఈ సభలకు భద్రత కల్పించకపోతే తామే లాఠీలు పట్టుకొని జనాన్ని కంట్రోల్ చేయాలా అని పవన్ కళ్యాణ్ అడిగారు.
తమ మీద తమ వాళ్లతో దాడులు చేయించుకోవడం , తమ ఇళ్లను తమ వారితో తగులబెట్టుకొనే సంస్కృతి వైసీపీ నేతలదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న దాడులు, దౌర్జన్యాలతో తమ మిత్రపక్షమైన బీజేపీతో కూడా చర్చిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. పోలీసులు నిస్తేజంగా ఉండడం వల్లే శాంతి భద్రతల సమస్యలు వస్తాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తన విశ్వరూపం చేపిస్తుందని పవన్ కళ్యాణ్ అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎన్ని రకాల అరాచకాలు చేయాలో వైసీపీ అన్నీ చేస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు.
చంద్రబాబుతో తన సమావేశంపై వైసీపీ నేతలు, మంత్రులు చేసిన విమర్శలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆ పాచినోళ్లకు అంతకంటే ఏం మాటలు వస్తాయన్నారు. ఇరిగేషన్ మంత్రికి పోలవరం గురించి తెలియదని అంబటి రాంబాబుపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు.
also read:కందుకూరు, గుంటూరు తొక్కిసలాటకు వైసీపీ కుట్ర: పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత చంద్రబాబు
తాను అడుగు తీసి అడుగు వేస్తే వైసీపీకి ఇబ్బంది కలుగుతుందన్నారు తాను బండి, జీపు కొనుగోలు చేయకూడదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తాను వారాహి బండి తీసుకొంటే వైసీపీ వాళ్లకు వచ్చిన ఇబ్బంది ఏమిటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వైసీపీ మాత్రం కోట్లు ఖర్చు పెట్టి బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు కొనుగోలు చేయడంంలో ఎలాంటి తప్పు ఉండదని ఆయన ప్రశ్నించారు.