జమ్మలమడుగు టికెట్ కొలిక్కి : అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి, ఎంపీ అభ్యర్థిగా మంత్రి ఆది

By Nagaraju penumalaFirst Published Feb 8, 2019, 6:44 PM IST
Highlights

అనంతరం ఇకపై ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా పార్టీ విజయానికి కృషి చెయ్యాలని చంద్రబాబు నాయుడు ఇద్దరి నేతలను కలిపినట్లు సమాచారం. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం మెుదలుపెట్టాలని చంద్రబాబు నాయుడు రామసుబ్బారెడ్డికి చెప్పారు. 

అమరావతి: ఎట్టకేలకు చంద్రబాబుకు పీటముడిలా ఉన్న కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ రాజకీయం ఓ కొలిక్కి వచ్చింది. చంద్రబాబు నాయుడుని కంటిపై కునుకు లేకుండా చేస్తున్న నియోజకవర్గం జమ్మలమడుగు అని చెప్పాలి. 

ఇప్పటికే దశల వారీగా ఎన్నో సార్లు చర్చలు జరిపిన చంద్రబాబు నాయుడు చేసేది లేక చేతులెత్తేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే గత కొద్ది రోజుల క్రితం జరిపిన చర్చల్లో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఇద్దర్లో ఎవరో తేల్చుకోండంటూ వెళ్లిపోయారు. 

దీంతో మరుసటి రోజు చంద్రబాబుతో భేటీ అయిన ఇద్దరు నేతలు నిర్ణయం చంద్రబాబు నాయుడుకే వదిలేశారు. అయితే శుక్రవారం చంద్రబాబు నాయుడుతో ఇరునేతలు భేటీ అయ్యారు. 

ఈ భేటీలో చంద్రబాబు నాయుడు పలు అంశాలను ప్రస్తావించారు. అలాగే జమ్మలమడుగు అభ్యర్థిగా రామసుబ్బారెడ్డిని కన్ఫమ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవిని మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడుకు నారాయణ రెడ్డికి ఇచ్చేలా హామీ ఇచ్చారు. 

దీంతో రామసుబ్బారెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆ లేఖను సీఎం చంద్రబాబుకు అందజేశారు. అనంతరం మంత్రి ఆదినారాయణ రెడ్డి కడప పార్లమెంట్ కు పోటీ చేయనున్నట్లు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు మధ్య ఒప్పందం కుదరడంతో చంద్రబాబు నాయుడు ఊపిరిపీల్చుకున్నారు. 

అనంతరం ఇకపై ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా పార్టీ విజయానికి కృషి చెయ్యాలని చంద్రబాబు నాయుడు ఇద్దరి నేతలను కలిపినట్లు సమాచారం. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం మెుదలుపెట్టాలని చంద్రబాబు నాయుడు రామసుబ్బారెడ్డికి చెప్పారు. 

ఇకపోతే ఎమ్మెల్యే అభ్యర్థిగా రామసుబ్బారెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డిలను చంద్రబాబు ఎంపిక చేసినప్పటికీ ప్రజలు ఏవిధంగా రిసీవ్ చేసుకుంటారో అన్నది వేచి చూడాలి. 

click me!