
పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి పునరావాస బిల్లులను ఆపలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు పునరావాసం వివరాలను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వెల్లడించారు. లోక్ సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.
పునరావాస వివరాలను ఏపీ అందించిందని.. పోలవరం నిర్వాసిత కుటుంబాలు 1,06,006 ఉన్నాయని మంత్రి తెలిపారు. వారిలో ఇప్పటి వరకు 4,283 కుటుంబాలకే పునరావాస సాయం అందిందని షెకావత్ వెల్లడించారు. ప్రాజెక్టు పునరావాస ఖర్చును 2014 నుంచి తిరిగి చెల్లిస్తున్నామని.. ఏపీ నుంచి వచ్చిన బిల్లులను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నట్లు తెలిపారు. పీపీఏ, సీడబ్ల్యూసీ తనిఖీ తర్వాత బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. దీనితో పాటు భూసేకరణ, పునరావాసం కింద రూ.11,181 కోట్లు చెల్లించామని.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల పనులకు కాంట్రాక్టర్లు రావట్లేదని గజేంద్ర షెకావత్ వెల్లడించారు. కొన్ని పనులకు ఎన్ని సార్లు బిడ్లు ఆహ్వానించినా టెండర్లు రావట్లేదు అని షెకావత్ లోక్‌సభకు తెలిపారు.