కరోనా మహమ్మారి నుంచి ఆంధ్రప్రదేశ్ ను ఆ భగవంతుడే కాపాడాలని ఏపీ టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావ్ అన్నారు.
గుంటూరు: ఓ వైపు లక్ష కోట్లు దాటిన అప్పులు...మరో వైపు ఐదు లక్షలు దాటిన కరోనా కేసులు. ఇదేనా దేశమంతా ఏపీ వైపు చూసేలా చేయడమంటే? అని ఏపీ టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావ్ సైటైర్లు విసిరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనిపై సమాధానం చెప్పాలని అన్నారు. కరోనా మహమ్మారి నుంచి ఆంధ్రప్రదేశ్ ను ఆ భగవంతుడే కాపాడాలని... ఈ వైరస్ కట్టడిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని కళా వెంకట్రావు అన్నారు.
'' ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కరోనా కేసులు 5 లక్షలు దాటాయి. మరణాలు 5 వేలకు చేరువయ్యాయి. ఈ నెలాఖరుకు రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షలు దాటేస్తాయని ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఏపీ 2వ స్థానంలో ఉంది. కేసుల రికవరీల్లో మాత్రం మన రాష్ట్రం అట్టడుగున ఉంది. రాష్ట్రంలో ప్రతి పది సెకన్లకు ఒక కేసు నమోదవుతోంది. పరిస్థితి ఇంత ప్రమాదకరంగా మారినప్పటికీ కరోనా నియంత్రణను గాలికి వదిలి పిచ్చి తుగ్లక్ నిర్ణయాలతో ప్రభుత్వం కాలక్షేపం చేయడం బాధాకరం'' అని మండిపడ్డారు.
undefined
''పరీక్షలు చేయడం నుంచి చికిత్స వరకూ ప్రభుత్వం అన్నీ అబద్ధాలే చెబుతోంది. కరోనా పెద్ద విషయం కాదన్న రోజు నుంచి నేటికీ ముఖ్యమంత్రి జగన్ అదే ధోరణి కొనసాగిస్తున్నారు. ఓవైపు కోవిడ్ ఆస్పత్రుల్లో వసతులు అద్భుతమని అధికార పార్టీ నేతల మాటలు కోటలు దాటుతున్నాయ్. మరోవైపు క్వారంటైన్ సెంటర్లలో పట్టెడన్నం పెట్టండి మహాప్రభో అని రోగులు వేడుకుంటున్నారు. కరోనా నుంచి రికవరీ అయ్యి ఇంటికి వెళ్లే వారికి రూ. 2000 ఇస్తామని చెప్పి ఆచరణలో వందో, యాభయ్యో చేతిలో పెట్టి పంపించేస్తున్నారు. మరి ప్రభుత్వం చెబుతున్నట్టు కరోనా నియంత్రణకు ప్రతి నెలా కేటాయిస్తున్న రూ. 350 కోట్లు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలకు కేటాయించిన రూ. 1000 కోట్లు ఏమవుతున్నాయ్?కాకి లెక్కలతో ఎన్నాళ్లు కాలక్షేపం చేస్తారు?'' అని నిలదీశారు.
read more పాప భీతి లేకుండా...అంతర్వేది రథానికి నిప్పు పెట్టించింది బాబే: విజయసాయి సంచలనం
''మానవత్వం లేని ప్రభుత్వం మొదట్నుంచి కరోనా కట్టడికి ఓ వ్యూహమంటూ లేకుండా వ్యవహరిస్తోంది. కొవిడ్ ఆస్పత్రుల్లో సదుపాయాల కల్పన మొదలు పాజిటివ్ వచ్చిన వారి పర్యవేక్షణ వరకూ ప్రభుత్వ నిర్వహణ అధ్వానంగా ఉంది. వ్యాధి సోకి ఇంట్లో ఉన్నవారి విషయంలో సరైన ట్రాకింగ్ లేదు. సకాలంలో మందులు అందించడం లేదు'' అని ఆరోపించారు.
''రాష్ట్రవ్యాప్తంగా కరోనా చికిత్సకు సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల బడుగు, బలహీన వర్గాల ప్రజలు మెరుగైన వైద్యం పొందలేకపోతున్నారు. జిల్లా స్ధాయిలో పడకల కేటాయింపు కూడా సక్రమంగా లేదు. అరగంటలో పడక దొరకాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. నెల్లూరు జీజీహెచ్ కొవిడ్ ఆస్పత్రిలో ఓ వృద్ధుడు బాత్రూమ్ లో పడి చనిపోతే పక్క రోగులు చూసి చెప్పేవరకూ ఆస్పత్రి సిబ్బంది చూడలేదంటే ఇది ప్రభుత్వ పర్యవేక్షణా లోపం కాదా? తిరుపతికి చెందిన వ్యక్తి మూడు రోజుల వరుసగా ఆస్పత్రికి చుట్టూ తిరిగినా వైద్యం అందించలేదు. సకాలంలో చికిత్స చేస్తే తన బిడ్డ బతికేవాడంటూ గొల్లుమన్న ఆ తండ్రికి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పగలదా?'' అని ఆవేదన వ్యక్తం చేశారు.
''విజయవాడ ప్రభుత్వాసుప్రతిలోని కోవిడ్ ఐసోలేషన్ కేంద్రంలో 8 నెలల గర్భిణి నేలపై పడి ప్రాణాలొదిలితే పట్టించుకున్న దిక్కులేదు. బెడ్లు దొరక్క ఆస్పత్రి ఆవరణలోని చెట్ల కిందే పడిగాపులు, ఫోన్ చేస్తే గంటల తరబడి రాని అంబులెన్స్ లు ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు కాదా? ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందడం లేదని...వైసీపీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. ఎన్ని ఆందోళనలు చేసినా, ఎన్ని వినతులు సమర్పించినా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు రూ. 50 లక్షల బీమా కల్పించేందుకు ఈ ప్రభుత్వానికి మనసు రాలేదు'' అని పేర్కొన్నారు.
''ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న చిరు వ్యాపారులకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం అందించలేదు. వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే ఆరోగ్యశ్రీ అన్నారు. కానీ అదెక్కడా అమలుకు నోచుకోలేదు. కేంద్రం ఇచ్చిన కరోనా సాయాన్ని బొక్కేశారు. కరోనాతో ప్రజల ప్రాణాలు పోతుంటే ఈ ప్రభుత్వానికి నిద్ర ఎలా పడుతోంది? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం పబ్జీ గేమ్ కాదని ముఖ్యమంత్రి గుర్తించాలి. మూడు రాజధానులు, ముప్పయ్ రాజధానులంటూ విధ్వంసకర ఆలోచనలను పక్కపెట్టి కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రజల ప్రాణాలను కాపాడాలి'' అని కళా వెంకట్రావ్ సూచించారు.