ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి జగన్ సర్కార్ కసరత్తు, హైకోర్టు తీర్పు రిజర్వ్.. అమరావతిలో ఉత్కంఠ..!!

By Sumanth KanukulaFirst Published Jul 22, 2023, 11:29 AM IST
Highlights

రాజధాని అమరావతిలో ఆర్ 5 జోన్‌ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన  చేయనున్నారు.

రాజధాని అమరావతిలో ఆర్ 5 జోన్‌ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన  చేయనున్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు శాంక్షన్ పత్రాలను కూడా అందించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఇక, ఆర్‌ 5 జోన్‌‌లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఏపీ కేబినెట్ ఇదివరకే ఆమోదం తెలిపింది. 

ఇదిలా ఉంటే, ఆర్‌ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని రాజధానికి భూములిచ్చిన రైతులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమరావతిలోని ఆర్‌-5 జోన్‌లో పేదలకు ఇళ్లు నిర్మించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం రిజర్వ్‌లో ఉంచింది. అంతకుముందు అమరావతిలోని ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై పిటిషనర్లు, ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. జులై 24న పేదల ఇళ్లకు శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతుండగా.. ఈ ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు.

Latest Videos

రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు.. జీవో 45పై హైకోర్టు, సుప్రీం కోర్టు కోర్టు స్టే ఆర్డర్‌ ఇవ్వలేదని.. అందుకే అమరావతిలో ఆర్‌5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరం లేదని భావించినట్టుగా చెప్పారు. అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణంలో ఒక వర్గం ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని వాదనలు వినిపించారు. సీఆర్‌డీఏ నిబంధనల ప్రకారం సేకరించిన మొత్తం భూమిలో ఐదు శాతం పేదల ఇళ్ల నిర్మాణానికి వినియోగించాలని కోరారు. మాస్టర్‌ప్లాన్‌లో దీని కోసం భూమి కేటాయించకపోవడంతో.. ఎలక్ట్రానిక్ సిటీ అభివృద్ధికి కేటాయించిన భూమిలో కొంత భాగాన్ని ప్రభుత్వం పేదలకు కేటాయించిందని చెప్పారు. 

ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు పట్టాలు జారీ చేసే సమయంలో హైకోర్టు తుది తీర్పుకు లోబడి ఇళ్ల స్థలాల కేటాయింపు జరుగుతుందని పేర్కొంది. హైకోర్టు, సుప్రీం కోర్టు రెండింటిలోనూ కేసు పెండింగ్‌లో ఉంది.. అందువల్ల తుది ఉత్తర్వుల కోసం ఎదురుచూడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీకి ఎలా ముందుకు వెళ్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. అమరావతిలోని ఆర్‌-5 జోన్‌లో పేదలకు ఇళ్ల నిర్మాణంపై ప్రతికూల తీర్పు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? అని కూడా ప్రశ్నించింది. అటువంటి పరిస్థితిలో ఈ నివాస యూనిట్ల కోసం ఖర్చు చేసిన మొత్తానికి, లబ్ధిదారులకు వారి డబ్బును ఖర్చు చేయడానికి అనుమతించినందుకు ఎవరు సమాధానం చెబుతారని ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులను రిజర్వు చేసింది. మరోవైపు ఆర్‌ 5 జోన్ ఇళ్ల నిర్మాణానికి జగన్ సర్కార్ కసరత్తు చేస్తుండటంతో.. ఉత్కంఠ పరిణామాలు నెలకొన్నాయి. 

click me!