
జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దీక్షకు దిగుతున్నారు. చాలా కాలం తర్వాత జగన్ చేస్తున్న దీక్షకు ఈసారి గుంటూరు వేదిక అవుతోంది. ఎంతైనా రాజధాని జిల్లా కాబట్టి కాస్త జనసమీకరణ అది గట్టిగా చేయాలని పార్టీ యంత్రాంగం నిర్ణయించింది. ఈనెల 26, 27 తేదీల్లో జగన్ దీక్ష జరుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరల పతనానికి నిరసనగా దీక్ష చేయబోతున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు రావటం లేదని జగన్ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే కదా. ప్రత్తి, మిర్చి తదితర పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు కూడా అల్లాడుతున్నారు.
గుంటూరును జగన్ వేదికగా చేసుకోవటంలో వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే, గుంటూరు రాజధాని జిల్లా. అందులోనూ ప్రత్తి, మిర్చి లాంటి వాణిజ్య పంటలకు బాగా ప్రసిద్ధి. అదే సమయంలో రాజధాని నిర్మాణం పేరుతో వేలాది ఎకరాలను ప్రభుత్వం రైతుల నుండి సేకరించింది. ఇంకోవైపు వేలాది రైతులు ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నారు. దాంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే దీక్షకు రైతుల నుండే మంచి స్పందన వస్తుందని వైసీపీ భావిస్తోంది. కాబట్టే జగన్ తన దీక్షకు గుంటూరును ఎన్నుకున్నారు.