
జగన్ మీడియాకు అధికార పార్టీ విస్తృత ప్రచారం కల్పించింది. ఎంతస్ధాయిలో ప్రచారం వచ్చిందంటే జగన్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇంత తక్కువ సమయంలో అంత ప్రచారం ఎన్నడూ రాలేదేమో. అసెంబ్లీలో గంటల తరబడి ముఖ్యమంత్రి దగ్గర నుండి స్పీకర్, మంత్రులు, ఎంఎల్ఏలు జగన్ మీడియా గురించి మాట్లాడింది మాట్లాడిందే. ఒకవైపు జగన్ మీడియాపై అక్కసు వెళ్ళగక్కుతూనే ఇంకోవైపు ఎప్పుడెప్పుడు తమ గురించి వచ్చిన వార్తలను తేదీలతో సహా చెప్పటం చూస్తుంటే అధికార పార్టీ సభ్యులు జగన్ మీడియాను ఎంతలా ఫాలో అవుతున్నారో తెలుస్తోంది.
అగ్రిగోల్డ్ బాధితుల అంశం చర్చకు వచ్చినపుడు జగన్ మాట్లాడుతూ ప్రత్తిపాటి పుల్లారావు భార్య భూములు కొనుగోలు చేసిందంటూ ఆరోపించారు. దాంతో సభలో గందరగోళం మొదలైంది. తనపై జగన్ చేసిన ఆరోపణలకు సమాధానం ఇచ్చిన ప్రత్తిపాటి భూముల కొనుగోలు విషయమై జగన్ మీడియాలో గతంలో వచ్చిన వార్తలను గుర్తుచేసారు. తాను చేసిన సవాలును కూడా మంత్రి ప్రస్తావించారు. ఇద్దరి మధ్య చర్చ జరుగుతుండగానే మంత్రి అచ్చెన్నాయడు, యనమల రామకృష్ణుడు, కామినేని శ్రీనివాస్ తో పాటు బుచ్చయ్యచౌదరి, అనిత, చంద్రబాబునాయుడు తదితరులు కూడా జగన్ మీడియాపై పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు.
చివరగా స్పీకర్ కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ, మహిళా సదస్సు సందర్భంగా తన వ్యాఖ్యలను కూడా జగన్ మీడియా వక్రీకరిచిందంటూ ఆరోపించారు. దాంతో సదస్సు సందర్భంగా స్పీకర్ చేసిన వ్యాఖలు ఏమటనే విషయమై తెలుసుకునేందుకు జనాలు యూట్యూబ్ ను ఆశ్రయించారు. అంటే అప్పుడు స్పీకర్ ఏమన్నారో తెలియని వాళ్ళు కూడా స్పీకర్ వ్యాఖ్యలను తెలుసుకునేందుకు, జగన్ మీడియాలో ఏం వచ్చిందో తెలుసుకునేందుకు యూట్యూబ్ ను ఆశ్రయించారు. మొత్తం మీద ప్రభుత్వ ఖర్చుతో జగన్ మీడియాకు మాత్రం విస్తృత ప్రచారం వచ్చేసింది.