
అసెంబ్లీలో విచిత్రమైన పరిస్ధితి నెలకొంది. ప్రతిపక్షమన్నాక ఆరోపణలే చేస్తుంది. ఆవి తప్పని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఎక్కడైనా ఇదే పద్దతి. మరి ఆరోపణలు చేసే ప్రతిపక్ష సభ్యులను సభనుండి వెలేయటం అన్నది కొత్త సంప్రదాయం. గతంలో ఎన్నడూ లేని పద్దతులను తెలుగుదేశంపార్టీ ప్రవేశపెడుతున్నది. ఆరోపణలు చేస్తే ఇక సభ నుండి వెలేనా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
అగ్రిగోల్డ్ భూములను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య పేరుతో కొనుగోలు చేసారన్నది వైసీపీ ఆరోపణలు. అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి సభలో గురువారం ప్రస్తావించారు. దానికి ప్రత్తిపాటి కూడా ధీటుగానే స్పందించారు. తాను అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలనుండి శాస్వతంగా వైదొలుగుతానన్నారు.ఒకవేళ నిరూపించలేకపోతే రాజకీయాలనుండి వైదొలుగుతారా అంటూ జగన్ కు సవాలు విసిరారు. మామూలుగా అయితే విషయాన్ని అక్కడితే వదిలేయాలి.
అయితే, ప్రత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా అచ్చెన్నాయడు, యనమల రామకృష్ణుడు, కామినేని శ్రీనివాసరావు, పీతల సుజాత, బుచ్చయ్యచౌదరి, అనిత, చంద్రబాబునాయుడు నిలిచారు. పదేపదే అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. పైగా ప్రత్తిపాటి లేదా జగన్ ఇద్దరిలో ఎవరో ఒకరే సభలో ఉండాలని చంద్రబాబు సవాలు విసరటం విచిత్రంగా ఉంది.
గతంలో కూడా ఎందరో మంత్రులుపై ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే విచారణకు ఆదేశిస్తుంది. లేకపోతే ప్రతిపక్షాల ఆరోపణలను ఖండిస్తుంది. సహజంగా జరిగేదే ఎక్కడైనా. కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబుతో సహా మంత్రులందరూ జగన్ను సభలో నుండి వెలేయటానికి ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి పరిణామాలు చూస్తుంటే.
వైఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ లక్ష కోట్లు తిన్నాడని చంద్రబాబుతో సహా మంత్రులు, నేతలు వేలసార్లు ఆరోపణలు చేసివుంటారు. మరి వారి ఆరోపణలకు ఆధారాలున్నాయా? న్యాయస్ధానంలో జగన్ కేసులు విచారణలో ఉండగానే టిడిపి ఏ విధంగా ఆరోపణలు చేస్తోంది? కాబట్టి సభలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే జగన్ ఆరోపణలను అడ్డంపెట్టుకున్నట్లు కనబడుతోంది.