కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నారు. ఈ మేరకు కసరత్తు చేస్తున్నారని సమాచారం.
అమరావతి:తెలంగాణ సీఎం కేసీఆర్ తరహలోనే ఏపీ సీఎం జగన్ కూడ కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకోవాలని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన చేసినట్టుగానే ఏపీ రాష్ట్రంలో కూడ జిల్లాల పునర్విభజనకు సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారు.
జిల్లాల పునర్విభజన చేయాలని ప్రభుత్వం యోచిస్తున్న విషయాన్ని సీఎం జగన్ ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.ఈ విషయమై బుధవారం నాడు గవర్నర్ తో సీఎం జగన్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది.
ఎన్నికల సమయంలో జిల్లాల పునర్విభజన గురించి ఏపీ సీఎం జగన్ హామీ ఇచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గం వారీగా జిల్లాల పునర్విభజన చేయాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. జిల్లాల పునర్విభనతో పాలనలో సంస్కరణలకు సులభంగా అమలు చేసేందుకు వీలుగా ఉంటుందని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
జిల్లాల పునర్విభజన పాలనలో కొత్త ఒరవడికి, వికేంద్రీకరణ సేవలకు దోహదపడుతోందని సీఎం అభిప్రాయంతో ఉన్నారు. మరో నాలుగు మాసాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ నాటికి గణతంత్ర దినోత్సవ వేడుకల నాటికి కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకు వచ్చేలా జగన్ సర్కార్ ప్లాన్ చేస్తోంది.
తెలంగాణ తరహలోనే ఏపీలో కూడ కొన్ని పథకాలకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇదే తరహలోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనుంది. కంటి వైద్య చికిత్స కోసం పరీక్షలను కూడ జగన్ సర్కార్ చేపట్టింది. తెలంగాణలో కంటి వెలుగు పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది.