కుప్పంలో జగన్ వ్యూహం ఇదేనా ?

First Published Jan 5, 2018, 1:02 PM IST
Highlights
  • వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద వ్యూహంతోనే ముందుకు వెళుతున్నారు.

వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద వ్యూహంతోనే ముందుకు వెళుతున్నారు. సామాజికవర్గాలపై మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ సర్వే చేయించుకుంటన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, రాష్ట్రంలోని మొత్తం జనాభాలో బిసిలే ఎక్కువ. అందుకనే వచ్చే ఎన్నికల్లో బిసిలే కీలక పాత్ర పోషిస్తారనటంలో సందేహం లేదు.

అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ వ్యూహాత్మకంగా కుప్పం నియోజకవర్గంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని అభ్యర్ధిగా ప్రకటించారు. వైసిపి అధికారంలోకి వస్తే చంద్రమౌళిని ఏకంగా మంత్రివర్గంలోకే తీసుకుంటామని బహిరంగంగా హామీ కూడా ఇచ్చారు. సరే, ఇదంతా వచ్చే ఎన్నికల్లో వైసిపి గెలిచిన తర్వాత జరిగే ముచ్చటే అనుకోండి. అయితే, ఇంత ముందుగా అభ్యర్ధిని ప్రకటించటం వెనుక జగన్ ప్లాన్ స్పష్టమవుతోంది.

అదేమిటంటే, చిత్తూరు జిల్లాలో బాగా వెనుకబడిన నియోజకవర్గాల్లో కుప్పం కూడా ఒకటి. చంద్రబాబునాయుడు ఇక్కడి నుండి దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి జరగటం లేదన్నది వాస్తవం.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే కుప్పం నియోజకవర్గంలో బిసిల జనాభానే చాలా ఎక్కువ. మొత్తం 1.96 లక్షల ఓట్లలో బిసిల ఓట్లే సుమారుగా ఒక లక్షంటుంది. మళ్ళీ ఇందులో కూడా వన్నికుల క్షత్రియుల ఓట్లే 70 వేలదాకా ఉండొచ్చు. జగన్ ప్రకటించిన చంద్రమౌళి వన్నికుల క్షత్రియుడే. పోయిన ఎన్నికల్లో కూడా చంద్రమౌళికి సుమారు 55వేల ఓట్లు వచ్చాయి.

చంద్రబాబుపై వైసిపి అభ్యర్ధి గెలిస్తే బ్రహ్మాండం బద్దలైనట్లే.  ఒకవేళ గెలవకపోయినా గణనీయమైన స్ధాయిలో ఓట్లు తెచ్చుకున్నా చాలన్నది జగన్ వ్యూహం. పోయిన సారి చంద్రబాబుకు సుమారు 46 వేల ఓట్ల మెజారిటి వచ్చింది. ఆ మెజారిటీని చంద్రమౌళి బాగా తగ్గించినా వైసిపికి లాభం జరిగినట్లే. ఎలాగంటే, జగన్ ప్రయోగించిన బిసి కార్డు బాగా పనిచేసినట్లే భావించాలి. కుప్పంలోనే చంద్రబాబు మెజారిటీని బాగా తగ్గించ గలిగినపుడు మిగిలిన నియోజకవర్గాల్లో బిసి కార్డుతో గెలవటం ఈజీ అన్నది జగన్ ఆలోచన.

అదే సమయంలో చిత్తూరు ఎంపి స్ధానంలో టిడిపి గెలుపు వెనుక కప్పం అసెంబ్లీలో వస్తున్న మెజారిటీనే కీలకం. కుప్పంలో మెజారిటీ తగ్గితే చిత్తూరు ఎంపి సీటుకు కూడా మెజారిటీ తగ్గిపోతుంది. అదిచాలు వైసిపి చిత్తూరు సీటును గెలుచుకోవటానికి. కుప్పంలో బిసి జనాభా తర్వాత ఎస్సీ, రెడ్డి, ముస్లింల ఓట్లే కీలకం. ఆ ఓట్లను కూడా తెచ్చుకోగలిగితే వైసిపి గెలుపు కష్టం కాదన్నది జగన్ వ్యూహంగా కనబడుతోంది. మరి జగన్ వ్యూహం ఏ మేరకు వర్కవుటవుతుందో చూడాలి.  

click me!