పోలవరం విషయంలో జగన్ చేసింది క్షమించరాని నేరం.. అసమర్థ, అహంకార నిర్ణయాలతో సర్వనాశనం చేశారని చంద్రబాబు ఫైర్

By Galam Venkata Rao  |  First Published Jun 17, 2024, 8:41 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి పోలవరం ప్రాజెక్టును నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. జగన్ అసమర్థ, అహంకార నిర్ణయాలతో పోలవరాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి చూస్తే బాధ, ఆవేదన కలుగుతోందని వాపోయారు.


ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును మాజీ సీఎం జగన్ మూర్ఖత్వం, అహంకారంతో సర్వనాశనం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని చూస్తే బాధేస్తోందన్నారు. ప్రాజెక్టుకు జరిగిన నష్టం చూస్తే జగన్ రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తి అని అర్థమవుతోందన్నారు. నాటి ప్రభుత్వం విధ్వంసానికి పోలవరం ఒక కేస్ స్టడీ లాంటిదన్నారు. పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పు చేశారన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు తొలిసారి పోలవరం ప్రాజెక్టును సోమవారం పరిశీలించారు. మంత్రులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి వ్యూ పాయింట్ వద్ద నుండి ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం క్షేత్రస్థాయిలో కలియదిరిగి ప్రాజెక్టు వద్ద పరిస్థితిని సందర్శించారు. స్పిల్ వే, కాఫర్ డ్యాం, డయా ఫ్రం వాల్ తో పాటు 22, 23 గేట్ల దగ్గర నుండి ప్రాజెక్టును సందర్శించారు. ఎడమగట్టు దగ్గర కుంగిన గైడ్ బండ్ ప్రాంతానికి వెళ్లారు. గ్యాప్-3 ప్రాంతం, ఎగువ కాఫర్ డ్యాం ప్రాంతాన్ని పరిశీలించారు. మొత్తం ప్రాజెక్టు నిశితంగా పరిశీలించిన సీఎం... అధికారులను పలు ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. డయా ఫ్రం వాల్ దెబ్బతిన్న ప్రాంతాన్ని సందర్శించారు. అధికారులతో సమీక్ష నిర్వహించాక చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. అయిదేళ్ల తన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.

Latest Videos

టీడీపీ హయాంలో 72 శాతం పనులు పూర్తి..
‘‘పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రానికి కరవు అనేది లేకుండా చేయొచ్చని భావించాం. 2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ-బీజేపీ, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే 7 మండలాలు తెలంగాణలో ఉంటే...అవి ఏపీలో కలిపితేనే ప్రమాణస్వీకారం చేస్తానని కేంద్రంతో చెప్పాను. దీంతో మొదటి కేబినెట్ సమావేశంలోనే 7 మండలాలు ఏపీలో కలిపేలా నిర్ణయం తీసుకున్నారు. అనేక దశాబ్దాల కసరత్తు తర్వాత 45.72 మీటర్ల ఎత్తుతో 194 టీఎంసీలు నీటిని నిల్వ ఉంచేలా ప్రాజెక్టుకు డిజైన్ చేశాం. 194 టీఎంసీల నీళ్లు ప్రాజెక్టులో నిల్వ ఉంచుకుంటే వరద నీటితో కలిపి 320 టీఎంసీల నీటిని వాడుకోవడానికి వీలవుతుంది. తద్వారా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు రాయలసీమకు కూడా ఈ నీటిని ఇవ్వొచ్చు. ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిలో 99 శాతం వాడుకునే అవకాశం ఉంది. 2014-19 మధ్య 72 శాతం మేర పనులను పూర్తి చేశాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. 

సమాంతరంగా డయాఫ్రం వాల్ నిర్మాణానికి రూ.990 కోట్లు అవసరం...
‘‘గతంలో నేను సిఎంగా ఉన్నపుడు 30 సార్లు ప్రాజెక్టును సందర్శించా...ఇప్పుడు మళ్లీ 31వ సారి వచ్చాను. నా మనసంతా ప్రాజెక్టుపైనే ఉండేది...కానీ ప్రాజెక్టు కోసం నేను పడ్డ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా చేశారు. భూ సేకరణలో కూడా బాధితులను ఒప్పించి ముందుకు వెళ్లాం. కానీ వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండర్ అంటూ ఏజన్సీని మార్చారు, అధికారులను మార్చారు. గత పాలకుల నిర్లక్ష్యంతో 2 సార్లు వచ్చిన వరదలతో డయాఫ్రం వాల్ 4 చోట్ల దెబ్బతింది..ప్రభుత్వం దీన్ని కాపాడలేపోయింది.  డయా ఫ్రం వాల్ 35 శాతం దెబ్బతింది. కానీ గత ప్రభుత్వం కాపాడకుండా ప్రాజెక్టుతో ఆడుకోవడం వల్ల తీవ్రమైన నష్టం జరిగింది. డయాఫ్రం వాల్ పై గతంలో మేం ఖర్చు చేసింది రూ.446 కోట్లు అయితే...జగన్ నిర్వాకం వల్ల ప్రస్తుతం రిపేర్లు చేయడానికి రూ.447 కోట్లు అవుతుంది...అయినా పూర్తిస్థాయిలో బాగవుతుందనే నమ్మకం లేదని అధికారులు చెప్తున్నారు. రెండో ప్రణాళిక ప్రకారం సమాంతరంగా కొత్త డయాఫ్రం వాల్ కట్టాలంటే రూ.990 కోట్లు ఖర్చు అవుతుంది. ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యామ్ ను రూ.550 కోట్లతో నిర్మాణం జరిగింది. అయితే గత ప్రభుత్వం నిర్వాకంతో చివర్లో ఉన్న గ్యాప్ పూర్తి చేయకపోవడంతో తీవ్ర నష్టం జరిగింది,  గైడ్ బండ్ కూడా కుంగిపోయింది. ఇవన్నీ చక్కదిద్దాలంటే ఎన్ని వేల కోట్లు కావాలో ఇప్పటికీ అధికారుల వద్ద నిర్ధిష్టమైన లెక్కలు లేవు.  2019 నుండి ఏజన్సీలను మార్చకుండా పనులు కొనసాగి ఉంటే 2020 చివరి నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ ఇప్పుడు ఈ రిపేరు పనులకే నాలుగు సీజన్లు పడుతుందని అధికారులు చెప్తున్నారు. అది కూడా అనుకున్న ప్రకారం అన్నీ సవ్యంగా జరిగితేనే’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.


జగన్ చిక్కుముళ్లు...
‘‘ఒక వ్యక్తి రాష్ట్రానికి శాపంగా మారతాడని చెప్పడానికి పోలవరం ఒక కేస్ స్టడీ. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ దీనిపై చర్చించాలి...జరిగిన నష్టం ప్రతి ఒక్కరికీ తెలియాలి...ఏ ఒక్కటీ దాచిపెట్టకూడదు. కాఫర్ డ్యాం ద్వారా నీళ్లు లీకేజీ కంట్రోల్ అవ్వకపోతే డయాఫ్రం వాల్ పనులు చేయడం కుదరదు. లీకేజీ ద్వారా వచ్చిన నీళ్లు ఎత్తిపోయాలంటే భారీగా ఖర్చు అవుతంది. జగన్ చేతకాని తనంతో ప్రాజెక్టుకు చిక్కు ముళ్లు వేశారు. 2014-19 వరకు సగటున యేటా రూ.13,683 కోట్లను మా ప్రభుత్వం ఇరిగేషన్ మీద ఖర్చు చేసింది.. బడ్జెట్ పెరిగిప్పుడు కేటాయింపులు పెరగాలి... కానీ వైసీపీ ప్రభుత్వంలో అలా జరగలేదు. ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని పూర్తి చేయాలి...ఇది ప్రతి ఒక్కరికీ సంబంధించిన ప్రాజెక్టు. ప్రాజెక్టు పరిస్థితి చూస్తే బాధ, ఆవేదన కలుగుతోంది. అయినా నిబ్బరంగా ఉండి ముందుకు తీసుకెళ్తాం. 2019లో వచ్చిన ప్రభుత్వం ఏజన్సీని మార్చకపోతే నెలలోనే కాఫర్ డ్యాం పూర్తయ్యేది...కానీ వెంటనే ఏజన్సీని మార్చారు. ఏజన్సీని మార్చొద్దని పీపీఏ, కేంద్రం కూడా లేఖ రాశాయి..’’ అని  ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

లోతుగా అధ్యయనం చేస్తున్నా...
‘‘నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాజెక్టు సందర్శనకు వస్తే అడ్డుకున్నారు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును ప్రజలకు చూపించాం. ఇది ప్రజల ప్రాజెక్టు. ఈ సీజన్ అయిపోయింది...డిసెంబర్ వరకూ ఏ పనీ చేయడానికి కుదరదు. ప్రాజెక్టుపై లోతుగా అధ్యయనం చేస్తున్నా. డయాఫ్రం వాల్ కనబడలేదని చెప్పిన మంత్రులను కూడా చూశాం. వ్యయం పెరుగుతూ పోతే కేంద్రానికి కూడా భారమే అవుతుంది. పోలవరాన్ని వివాదాలకు కేంద్రంగా మార్చారు. ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేయాలి...నష్టం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. కేంద్రంతో కూడా దీనిపై సంప్రదింపులు జరిపి ముందుకెళ్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

click me!