ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా... విజయవాడలో రౌండ్ టేబుల్ సదస్సు: మంత్రి మేకపాటి

Arun Kumar P   | Asianet News
Published : Mar 31, 2021, 05:10 PM IST
ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా... విజయవాడలో రౌండ్ టేబుల్ సదస్సు: మంత్రి మేకపాటి

సారాంశం

 విజయవాడ వేదికగా ఐ.టీ సంస్థల సీఈవోలతో ఏప్రిల్ 2న రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.

అమరావతి: కరోనా అనంతర పరిస్థితులు, పరిణామాలను ఐ.టీ రంగంలో అధిగమించడానికి చేపట్టవలసిన చర్యలపై చర్చించేందుకు విజయవాడ వేదికగా ఐ.టీ సంస్థల సీఈవోలతో ఏప్రిల్ 2న రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. సచివాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం మంత్రి మేకపాటి అధ్యక్షతన ఐ.టీ శాఖపై సమీక్ష సమావేశం జరిగింది. ఐ.టీ సంస్థలకు చెల్లించవలసిన బకాయిల గురించి ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో మంత్రి గౌతమ్ రెడ్డి ప్రధానంగా చర్చించారు. ఐ.టీ సంస్థలకు ఇవ్వవలసిన పెండింగ్ ఇన్సెంటివ్స్ లో మంజూరు కావలసిన క్లెయిమ్ లు, విడుదల చేయవలసిన వాటి వివరాలను మంత్రి మేకపాటి ఆరా తీశారు.  

2018 నుంచి 2021 వరకూ ఏపీఈఐటీఏ పరిధిలో ఉన్న ప్రోత్సాహక బకాయిల మొత్తం రూ.21.18 కోట్లుగా ఉన్నట్లు ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్ మంత్రికి వివరించారు. గత ప్రభుత్వ ప్రోత్సాహక బకాయిలు 207 క్లెయిమ్ లకు రూ.49 కోట్లు బకాయిలున్నాయని మంత్రి మేకపాటికి ఏపీటీఎస్ ఎండీ వివరించారు. అది కాకుండా గత రెండేళ్ల బకాయిలు 67 క్లెయిమ్ లకు  మరో 11 కోట్లుగా ఉన్నట్లు ఆయన మంత్రి మేకపాటి దృష్టికి తీసుకువెళ్లారు. 

ఉపాధి, లీజ్ రెంటల్, విద్యుత్ రాయితీ, స్టాంప్ డ్యూటీ, డీటీపీ రెంటల్ సబ్సిడీల వారీగా క్లెయిమ్ లకు ఇవ్వవలసిన మొత్తాన్ని వేర్వేరుగా మంత్రికి ప్రజంటేషన్ ఇచ్చారు.  ఐ.టీ ప్రోత్సాహకాలు సీఎఫ్ఎమ్ఎస్ పరిధిలో 142 క్లెయిమ్ లకు గానూ సుమారు రూ.24 కోట్లుగా ఉన్నట్లు ఐ.టీ అధికారులు మంత్రికి తెలిపారు. 2018 నుంచి 2021 వరకూ ఏపీఈఐటీఏ పరిధిలో ఉన్న ప్రోత్సాహక బకాయిల మొత్తం రూ.21.18 కోట్లుగా వారు పేర్కొన్నారు.

ఐ.టీ రంగంలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా విజయవాడ నోవాటెల్ హోటల్ లో ఐ.టీ సీఈవోలతో రాష్ట్ర ప్రభుత్వం రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఐ.టీ, ఎలక్ట్రానిక్స్ సంస్థలతో జరిగే ఈ సమావేశంలో వర్క్ ఫ్రమ్ హోమ్, నైపుణ్యం, ఉపాధి, కాన్సెప్ట్ సిటీలు, ఇంటర్నెట్ లైబ్రరీ అంశాలపై చర్చించే అవకాశం ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఐ.టీ రంగంలో కరోనా ప్రభావం చూపని విధంగా వినూత్నమైన కార్యక్రమానికి  ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఐ.టీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మితో  వర్క్ ఫ్రమ్ హోమ్ అంశంపై మాట్లాడారు. 

read more  కారణమిదీ: మళ్లీ మొదటికొచ్చిన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం

10 నెలల క్రితమే ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఆచరణలను సదస్సులో వివరించడంపై పలు సూచనలిచ్చారు.  ఇప్పటికే పలు ఐ.టీ సంస్థల సీఈవోలకు  ఆహ్వానం దగ్గర నుంచి సమావేశ ఏర్పాట్లు జరుగుతున్న తీరుపై మంత్రి ఆరా తీశారు. ఒక్కో టేబుల్ కి ఎంత మంది కూర్చుంటారు? సమావేశ మందిరం, వసతుల వివరాలను ఐ.టీ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి మంత్రికి వివరించారు. 

రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంచడమే సదస్సు నిర్వహణ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. సమీక్ష సమావేశం అనంతరం మంత్రి ఛాంబర్ వద్దకు వచ్చిన మీడియాతో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రోత్సాహకాల బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రోత్సాహకాల బకాయిల విషయంలో గత ప్రభుత్వంలో పరిస్థితి రాకూడదనే ముఖ్యమంత్రి ఆదేశాలను ఐ.టీ శాఖ అధికారులకు మంత్రి గౌతమ్ రెడ్డి మార్గనిర్దేశం చేశారు. 

ఈ కార్యక్రమంలో ఐ.టీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఐ.టీ శాఖ ప్రత్యేక కార్యదర్శి సుందర్, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, జాయింట్ సెక్రటరీ నాగరాజ,  ఐ.టీ శాఖ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. 


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!