ఫిరాయింపు నియోజకవర్గాల్లో అభ్యర్ధులు రెడీ అయ్యారా ?

First Published Mar 20, 2018, 7:03 AM IST
Highlights
  • జ్యోతులతో పాటు మొత్తం 22 మంది టిడిపిలోకి ఫిరాయించారు.

ఫిరాయింపు నియోజకవర్గాలపై జగన్ దృష్టి పెట్టారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో టిడిపి నేత జ్యోతుల చంటిబాబు పార్టీలోకి చేర్చుకోవటం ఇందులో భాగమే అని అర్ధమవుతోంది. జగ్గంపేటలో పోయిన ఎన్నికల్లో గెలిచిన జ్యోగుల నెహ్రూ తర్వాత టిడిపిలోకి ఫిరాయించారు. జ్యోతులతో పాటు మొత్తం 22 మంది టిడిపిలోకి ఫిరాయించారు. ఫిరాయింపు నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయం కోసం జగన్ పెద్ద కసరత్తే చేస్తున్నారు.

ఎలాగైనా సరే వారికి వచ్చే ఎన్నికల్లో ఫిరాయింపులకు గుణపాఠం చెప్పాలన్నది జగన్ ప్రధాన ఉద్దేశ్యంగా కనబడుతోంది. ఎంతో నమ్మకంతో జగన్ కీలక బాధ్యతలు అప్పగించిన, ప్రధాన్యత ఇచ్చిన ఎంఎల్ఏల్లో గిడ్డి ఈశ్వరి, జ్యోతుల నెహ్రూ, అమరనాధ్ రెడ్డి, నారాయణరెడ్డి, అశోక్ రెడ్డి, భూమా కుటుంబం లాంటి వాళ్ళు తనను దెబ్బకొట్టి టిడిపిలోకి ఫిరాయించటాన్ని జగన్ తట్టుకోలేకపోతున్నారు.

అప్పటి నుండి ఫిరాయింపు నియోజకవర్గాలపై జగన్ పెద్ద దృష్టి పెట్టారని వైసిపి వర్గాలంటున్నాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు కూడా ప్రత్యేకంగా చెప్పి ఫిరాయింపు నియోజకవర్గాలపై ప్రత్యేకమైన కసరత్తులు చేయాలని జగన్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే ప్రశాంత్ కూడా పదే పదే సర్వేలు చేస్తున్నారట.

అందులో భాగంగానే మొదట జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల చంటబాబు  పార్టీ కండువా కప్పటం. జ్యోతుల చంటిబాబు-జ్యోతుల నెహ్రూ పోయిన ఎన్నికల్లో పోటీ పడ్డారు. అయితే, నెహ్రూ వైసిపి తరపున గెలిచి టిడిపిలోకి ఫిరాయించారు. అప్పటి నుండే చంటిబాబులో  అసంతృప్తి పేరుకుపోయింది. నియోజకవర్గంలో గట్టి పట్టున్నా చివరి రెండు ఎన్నికల్లో ఓడిపోయారు. మరి వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి.

జగ్గంపేట ఊపులోనే మరికొన్ని ఫిరాయింపు నియోజవర్గాల్లో కూడా త్వరలో అభ్యర్ధులను ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. అభ్యర్ధుల ఎంపిక దాదాపు పూర్తయిందని, ప్రకటించటమే మిగిలిందని పార్టీ వర్గాలంటున్నాయ్. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, అసలు ఫిరాయింపుల్లో ఎంతమందికి చంద్రబాబునాయుడు టిక్కెట్లు ఇస్తారన్నది కీలకం. ఎందుకంటే, ఫిరాయింపుల్లో చాలామందికి టిక్కెట్లు ఇచ్చేది అనుమానమే అంటూ టిడిపిలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి, ఫిరాయింపుల నియోజకవర్గాలపై ఇటు జగన్ అటు చంద్రబాబు ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది.

 

 

click me!