అఖిలపక్షానికి వైసిపి, జనసేనలు దూరం

First Published Mar 27, 2018, 7:22 AM IST
Highlights
బిజెపికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని అన్నీ పార్టీలను కూడగట్టాలని చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనబడుతోంది.

చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్సిపి, జనసేన పార్టీలు హాజరయ్యే అవకాశాలు కనిపించటం లేదు. కేంద్ర వైఖరికి నిరసనగా మంగళవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నిర్ణయం కూడా సోమవారం రాత్రి హటాత్తుగా తీసుకున్నదే. చూడబోతే బిజెపికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని అన్నీ పార్టీలను కూడగట్టాలని చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనబడుతోంది.

ప్రత్యేకహోదా, ప్రత్యేకప్యాకేజి, విభజన చట్టం అమలులో కేంద్ర వైఖరిని వైసిపి ఎప్పటి నుండో నిరసిస్తోంది. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ వైసిపితో పాటు ప్రతిపక్షాలు ఎన్నిసార్లు డిమాండ్ చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు.

సరే, ఆ విషయాలను పక్కనబెడితే, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపధ్యంలో రాష్ట్రంలో టిడిడిపి ఒంటరైపోయింది. ఈ విషయం చంద్రబాబులో తీవ్ర ఆందోళన మొదలైంది. అందుకనే హటాత్తుగా అఖిలపక్షం పేరుతో ప్రతిపక్షాలన్నింటినీ బిజెపికి దూరం చేయాలన్న ఆలోచనే చంద్రబాబులో కనబడుతోంది. నిజానికి ఇపుడు అఖిలపక్షం సమావేశం వల్ల ఒరిగేది కూడా ఏమీ లేదనే చెప్పాలి.

కారణాలేవైనా కానీ ఈరోజు జరిగే అఖిల సమావేశానికి వైసిపి, జనసేలు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. ఇక మిగిలింది వామపక్షాలు, బిజెపి, కాంగ్రెస్ పార్టీలే. ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి లేకుండా చంద్రబాబు సాధించేది ఏమీ ఉండదు. వామపక్షాల వల్ల ఏమీ ఉపయోగం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక, బిజెపిలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయ్. ఈ నేపధ్యంలో ఈరోజు సమావేశం ఏమి సాధిస్తుందో చూడాల్సిందే?

click me!