కాపుజాతిపై ముద్రగడ పట్టింతేనా?....

First Published Sep 1, 2017, 11:49 AM IST
Highlights
  • కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలతో కాపుజాతిపై  ముద్రగడ పట్టు విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది.
  • కాపులందరూ నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టిడిపికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలంటూ ముద్రగడ పిలుపినిచ్చారు.
  • దాంతో టిడిపి పరిస్ధితి మరింత దయనీయంగా తయారైంది.
  • నంద్యాల ఫలితం వచ్చింది. అక్కడ ఊహించని రీతిలో టిడిపి విజయం సాధించింది.

‘వెనకటికెవడో లేస్తే మనిషిని కానన్నాడట’... అలాగే ఉంది ముద్రగడ పద్మనాభం వ్యవహారం కూడా. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలతో కాపుజాతిపై  ముద్రగడ పట్టు విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే, గడచిన ఏడాదిన్నరగా కాపులకు రిజర్వేషన్ పేరుతో ముద్రగడ ఆందోళనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తునిలో రైలు దగ్ధం ఘటన తర్వాత ఆందోళనలు తీవ్రస్ధాయికి చేరుకుంది. అదే సమయంలో ప్రభుత్వం కూడా ఉద్యమాన్ని అంతే స్ధాయిలో అణిచివేస్తోంది.

ఇటువంటి సమయంలోనే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు నగారా మోగింది. దాంతో టిడిపిలో తీవ్ర ఆందోళన మదలైంది. అప్పటికే నంద్యాల ఎన్నికలో టిడిపి-వైసీపీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. అదేసమయంలో కాపులందరూ నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టిడిపికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలంటూ ముద్రగడ పిలుపినిచ్చారు. దాంతో టిడిపి పరిస్ధితి మరింత దయనీయంగా తయారైంది.

ముద్రగడ పిలుపుతో టిడిపి ఇబ్బంది పడింది. అందుకనే ఏవో కారణాలు చెప్పి కాకినాడ ఎన్నికను వాయిదా వేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. సాధ్యం కాకపోవటంతో తప్పని పరిస్ధితిలోనే ఎన్నికకు సిద్దపడింది. ఇంతలో నంద్యాల ఫలితం వచ్చింది. అక్కడ ఊహించని రీతిలో టిడిపి విజయం సాధించింది. ఎందుకంటే, నంద్యాలలో బలిజల ఓట్లు సుమారు 25 వేలున్నాయి. అయినా విజయం సాధించిందంటే బలిజలెవరూ ముద్రగడ మాటను పట్టించుకోలేదని అర్ధమైంది. దాంతో కాకినాడలో కూడా టిడిపి నేతలు రెచ్చిపోయారు.

తీరా శుక్రవారం ఫలితాలను చూస్తే ఇక్కడ కూడా కాపులు ముద్రగడ పిలుపును లెక్కచేయలేదనే అర్దమవుతోంది. ఎందుకంటే,  ఎన్నికలు జరిగిన 48 డివిజన్లలో టిడిపి 32 చోట్ల గెలిచింది. ఇక్కడ కాపుల ఓట్లు 45 వేలున్నాయ్.  కాపులందరూ  నిజంగానే ముద్రగడ పిలుపుకు స్పందించి టిడిపికి వ్యతిరేకంగా ఓట్లు వేసుంటే కచ్చితంగా వైసీపీనే గెలిచుండేదనటంలో సందేహం అక్కర్లేదు. కానీ గెలిచింది టిడిపి. అంటే సొంతజిల్లాలో అదీ స్వస్ధలం కిర్లంపూడికి సమీపంలోనే ఉన్న కాకినాడలో కూడా ముద్రగడ మాట చెల్లుబాటు కాలేదన్న విషయం అర్ధమైపోయింది. కాబట్టి ప్రభుత్వం ముద్రగడను ఇక ఏ విషయంలో కూడా లెక్కచేయదనటంలో  సందేహమే అవసరం లేదు.

click me!