ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2024: 2014 నాటి కూటమి తెరమీదికి వస్తుందా?

By narsimha lodeFirst Published Feb 8, 2024, 11:26 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కొత్త పొత్తులు పొడిచే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో  చర్చ సాగుతుంది.  చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఇందుకు  ఊతమిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  2014 అసెంబ్లీ ఎన్నికల నాటి  కూటమి మరోసారి తెరమీదికి వస్తుందా అనే చర్చ ప్రారంభమైంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 2014లో  ఎన్నికలు జరిగాయి.  ఎన్నికలు జరిగిన తర్వాత  ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ  రాష్ట్రాల విభజన జరిగింది. 2014 ఎన్నికల సమయంలో  తెలుగుదేశం, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి.  ఎన్నికలకు ముందే  సినీ నటుడు పవన్ కళ్యాణ్  జనసేన పార్టీని ఏర్పాటు చేశారు.

తెలుగుదేశం,బీజేపీకి  జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ కూటమి అభ్యర్థులకు మద్దతుగా  పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో  తెలుగు దేశం పార్టీ చేరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన  తెలుగు దేశం ప్రభుత్వంలో  బీజేపీ చేరింది.   ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో  టీడీపీ బీజేపీ కూటమికి  జనసేన దూరమైంది.  ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా అంశంపై  బీజేపీ తీరును  జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు.   2019 ఎన్నికలకు ముందు  కూడ  బీజేపీతో  తెలుగు దేశం పార్టీ తెగదెంపులు చేసుకుంది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది.  తెలుగు దేశం పార్టీ  23 స్థానాలకే పరిమితమైంది.  ఈ ఎన్నికల్లో సీపీఐ,సీపీఐ(ఎం), బీఎస్పీలతో కలిసి పోటీ చేసిన జనసేనకు ఒక్క అసెంబ్లీ స్థానమే దక్కింది. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత  బీజేపీతో  జనసేన పొత్తు పెట్టుకుంది. 

అయితే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.  జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు విపక్షాలు ఉమ్మడిగా పోటీ చేయాలనే  ప్రతిపాదన జనసేన నుండి వచ్చింది.  ఈ క్రమంలోనే  తమ పార్టీ ముందున్న  ప్రతిపాదనలను  జనసేన అధినేత పవన్ కళ్యాణ్  బహిరంగంగానే  చెప్పారు.  ఈ దిశగానే తన వ్యూహాలు ఉంటాయని  పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  2023  సెప్టెంబర్ మాసంలో  చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును  పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆ సమయంలోనే  తెలుగు దేశం పార్టీతో  కలిసి పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తమతో  బీజేపీ కూడ కలిసి వస్తుందనే  ఆశాభావాన్ని  పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు.ఈ దిశగా పవన్ కళ్యాణ్ కూడ  బీజేపీ నాయకత్వంతో చర్చలు జరిపినట్టుగా  ప్రచారం సాగింది. 

also read:టీడీపీ-బీజేపీ పొత్తుపై ఊహగానాలు : పాత స్నేహం బలపడుతుందా?

టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ కూడ చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడ పెద్ద ఎత్తున సాగుతుంది.ఈ తరుణంలోనే  బుధవారం నాడు రాత్రి  చంద్రబాబు నాయుడు బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డా,  హోం మంత్రి అమిత్ షాతో  చంద్రబాబు సుమారు  45 నిమిషాలకు పైగా భేటీ అయ్యారు.  ఇవాళ  పవన్ కళ్యాణ్  కూడ  బీజేపీ నేతలతో చర్చలు జరపనున్నారు.  ఈ చర్చలకు సంబంధించి  తెలుగు దేశం, బీజేపీల నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో చర్చల తర్వాత ఈ మూడు పార్టీల మధ్య పొత్తుపై  స్పష్టత వచ్చే అవకాశం ఉందనే రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  2014 నాటి కూటమి మరోసారి తెరమీదికి వస్తుందా అనే చర్చ సాగుతుంది.  టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా పోటీ చేయనున్నాయనే ప్రచారంలో ఉంది.  బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు చర్చలు ఇందుకు ఊతమిస్తున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


 

click me!