కాపు నేతలనే ప్రభుత్వం టార్గెట్ చేసుకుందా ?

First Published Oct 31, 2017, 6:26 AM IST
Highlights
  • పోలీసుల వరస చూస్తుంటే వైసీపీ  అందునా కాపు నేతలపై బాగా కక్ష కట్టినట్లుంది.
  • అందుకే సంఘటనేదైనా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.

మొన్న కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం..నిన్న విజయవాడలో వంగవీటి రాధా..తాజాగా రామచంద్రాపురంలో జక్కంపూడి రాజా..వీరందరూ ఎవరు? ఏమిటి వీరందరికీ సంబంధం? అంటే వీరందరిని కలుపుతున్న అంశాలు మూడున్నాయి. మొదటిది వారంతా కాపు నేతలు. రెండో అంశం అందరూ కోస్తా ప్రాంతానికి చెందిన వారే. ఇక మూడో అంశమేమిటంటే ముగ్గురిలో ఇద్దరు  వైసీపీ నేతలు, మరొకరేమో ప్రభుత్వం కంటిలో నలుసులాగ తయారైన నేత. అది చాలదా? పోలీసులు కక్ష కట్టటానికి.

పోలీసుల వరస చూస్తుంటే వైసీపీ  అందునా కాపు నేతలపై బాగా కక్ష కట్టినట్లుంది. అందుకే సంఘటనేదైనా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.

ముద్రగడ పద్మనాభం విషయంలో తీసుకున్నా, వంగవీటి రాధా, జక్కంపూడి విషయంలో తీసుకున్నా పోలీసులది ఒకటే వరస. ఎప్పుడో జరిగిపోయిన విషయాలను వదిలేసినా తాజా ఘటన జక్కంపూడి విషయమే తీసుకున్నా చాలు పోలీసుల తీరుపై అనుమానాలు పెరిగిపోవటానికి.   

కారులో కూర్చుని వున్న జక్కంపూడి రాజా విషయంలో ఓ ఎస్ఐ వ్యవహరించిన తీరుతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆఖరికి టిడిపి ఎంఎల్ఏ తోట త్రిమూర్తులు కూడా పోలీసుల వైఖరినే తప్పు పట్టారంటేనే అర్దమవుతోంది పరిస్ధితి ఎంత దారుణంగా ఉందో.

రోడ్డుపైన ఆపిన కారును తీసేయమని ఎస్ఐ నాగరాజు చెప్పారు. రాజా కూడా కారును తీస్తాననే అన్నారు. అయితే, కారు తీసేంతలోనే ఎస్ఐ రెచ్చిపోయి జక్కంపూడి చొక్కా కాలర్ పట్టుకుని కారులో నుండి బయటకు లాగటం, రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్ళి పోలీసు జీపులో ఎక్కించటం, మళ్ళీ పోలీసు స్టేషన్లో విపరీతంగా కొట్టటం... అసలేం జరుగుతోందో కూడా అర్ధం కాలేదు.

వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడిపై నాగరాజు అంతలా రెచ్చిపోవటానికి కారణం కూడా కనబడటం లేదు. అయినా సరే, ఎస్ఐ రెచ్చిపోయి సినిమాలో చూపినట్లుగా నడిరోడ్డుపై పెద్ద సీనే క్రియేట్ చేసారు. ఇదంతా చూసిన తర్వాత అధికారపార్టీ వైఖరిపై కాపు నేతల్లో చర్చలు మొదలైంది.

ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే కాపు నేతలను టార్గెట్ చేసుకున్నదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. ఒకవైపు ముందస్తు ఎన్నికల వాతావరణం కనబడుతోంది. ఇంకోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర తేదీ దగ్గర పడుతోంది. ఇటువంటి నేపద్యంలో సంయమనం పాటించాల్సిన పోలీసులు కాపు సామాజిక వర్గం నేతలపై రెచ్చిపోతుండటం దేనికి సంకేతం?

 

click me!