చంద్రబాబుకు షాక్ తప్పదా ? బిసిల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ ?

First Published Dec 4, 2017, 5:37 PM IST
Highlights
  • చూడబోతే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు ఇబ్బందులు తప్పేట్లు లేదు.

చూడబోతే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు ఇబ్బందులు తప్పేట్లు లేదు. దశాబ్దాల పాటు టిడిపిని అంటిపెట్టుకుని ఉన్న బిసిలు ఒక్కసారిగా దూరమైపోతున్నారా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో ఓ కొత్త రాజకీయపార్టీ పెట్టాలన్న డిమాండ్ కూడా బిసిల్లో మొదలైంది. ఇదంతా ఎందుకంటే? మొన్ననే కాపులను బిసిల్లోకి చేర్చుతూ చంద్రబాబునాయుడు మంత్రివర్గం నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే. అదే విధంగా అసెంబ్లీలో ఓ తీర్మానం చేసి అమలు చేయాలంటూ కేంద్రానికి తీర్మానం కూడా పంపారు. బిసిల రిజర్వేషన్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా అదనంగా 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు చంద్రబాబు చెప్పినా బిసి సంఘాల నేతలు నమ్మటం లేదు. పైగా చంద్రబాబు ఆలోచనను పూర్తిగా తప్పు పడుతున్నారు.

చంద్రబాబు చేసిన పని వల్ల ఎటువంటి అర్హత లేని కాపులు బిసిల్లోకి చేరిపోవటం వల్ల తమకు నష్టమని బిసి సంఘాల నేతలు ఆందోళన పడుతున్నారు. ఇదే విషయమై బిసి సంఘాల సంక్షేమం రాష్ట్ర అధ్యక్షుడు కెశిని శంకర్ ‘ఏషియానెట్’ తో మాట్లాడుతూ భవిష్యత్తులో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అందులో భాగంగానే మంగళవారం 13 జిల్లాల కలెక్టరేట్ల ముందు ఆందళన నిర్వహిస్తామన్నారు. 7వ తేదీ బిసి సంఘాల కార్యవర్గాలతో విస్తృత సమావేశం నిర్వహిస్తున్నట్లు కూడా చెప్పారు.

తమ సమావేశాలకు రాజకీయ పార్టీలను దూరంగా పెడుతున్నట్లు స్పష్టం చేశారు. బిసిలకు అన్యాయం చేసే బిల్లును మంత్రివర్గంలో ఆమోదించి, అసెంబ్లీలో తీర్మానం చేస్తుంటే బిసి మంత్రులు, ఎంఎల్ఏలు చోద్యం చూస్తు కూర్చోవటం చాలా అన్యాయమన్నారు. అటువంటి వారిని తమ జాతి ఎన్నటికి క్షమించదని హెచ్చరించారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తూ ఓ బిసి మంత్రితోనే అసెంబ్లీలో ప్రకటన ఇప్పించటంకన్నా దుర్మార్గం ఏముంటుందని చంద్రబాబును  నిలదీసారు.

చంద్రబాబు దుర్మార్గాలను చూస్తు ఊరుకునేది లేదన్నారు. అందుకనే వచ్చే ఎన్నికల్లోగా అచ్చంగా బిసిల సంక్షేమం కోసమే ఓ రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు చెప్పారు. ప్రతీ నియోజకవర్గంలోనూ తక్కువలో తక్కువ 20 వేల ఓట్లుంటాయని ధీమా వ్యక్తం చేసారు. గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన తమ సామాజికవర్గంలో మొదలైందని శంకర్ స్పష్టంగా చెప్పారు.

click me!