
‘పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎన్ని ఆటలైనా ఆడుతుంద’నే సామెత నిజ్జంగా నిజం. వ్యవస్ధలు అచేతనమైనపుడు ఓ వ్యక్తి తన ఇష్టారాజ్యంగా ఎన్ని ఆటలైనా ఆడవచ్చని అసెంబ్లీలోని ఓ ఉదంతం రుజువు చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపి అసెంబ్లీకి ఇన్ఛార్జ్ కార్యదర్శిగా కె. సత్యనారాయణ అనే డిప్యుటీ సెక్రెటరీని నియమించారు. ఆయనపై అప్పటికే అనేక ఆరోపణలున్నాయి. పైగా ఆయనకన్నా విద్యార్హతలెక్కువున్న వారిని కాదని మరీ సత్యనారాయణను సెక్రటరీని చేసారు ఏలినవారు. అయితే, ఆయన వ్యవహారం ఆదినుండీ వివాదాస్పదమే. సెక్రెటరీ అయినా అదే ఒరవడిని సెక్రెటరీ కొనసాగిస్తున్నారు. దాంతో చాలామందికి మండింది ఆయనంటే.
అసలు సత్యనారాయణ నియామకం, అంతుకుముందు అందుకున్న పదోన్నతులపై వైసీపీ కేసు దాఖలు చేసింది హైకోర్టులో. అంతేకాకుండా అంతకుముందే ఆయన సర్వీసు రికార్దులను అందచేయాలంటూ సమాచార హక్కు చట్టం ద్వారా అడిగారు. చట్టం కూడా పిటీషనర్ అడిగిన వివరాలు ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చింది. అయితే, వ్యవస్ధలను లెక్కచేసే మనస్తతత్వం మొదటి నుండీ లేదు కాబట్టి ఆర్టిఐ ఆదేశాలనూ ఖాతరు చేయలేదు. దానిపై ఎన్నిమార్లు ఆర్టిఐ నోటీసులిచ్చినా పట్టించుకోలేదు.
ఒకవైపు ఆర్టిఐ నోటీసులు,మరో వైపు హై కోర్టులో కేసులు. ఇంతటి వివాదాస్పద అధికారిని ఇంకేదైనా ప్రభుత్వం అయివుంటే వెంటనే పక్కనపడేసేదే. కానీ ఇక్కడ ఉన్నది నిప్పు చంద్రబాబునాయుడు ప్రభుత్వం కదా. అందులోనూ స్పీకర్ కోడెల శివప్రసాదాయె. అందుకనే ఇద్దరూ సత్యనారాయణ వ్యవహారాలు, వివాదాలు అన్నీ తెలిసీ ఆయన్నే కొనసాగిస్తున్నారు. పైగా ఓ సొసైటీలో ఇళ్ళ ప్లాట్ల కుంభకోణానికి సంబంధించిన కేసులో తరచూ కోర్టులో హాజరై వస్తుంటారు కూడా. విద్యర్హతలున్న వారిని పక్కనబెట్టి, ఎవరికీ పదోన్నతులివ్వకుండా అంత వివాదాస్పద వ్యక్తిని సెక్రెటరీగా ఎందుకు కొనసాగిస్తున్నారో వారే చెప్పాలి. పైగా కోడెల, చంద్రబాబుల వద్ద సెక్రెటరీ ‘ఘన’కార్యాలపై పూర్తి నివేదికుంది.
సత్యనారాయణపై వచ్చిన ఆరోపణలపై తాజాగా మార్చి 1వ తేదీన ఆర్టిఐ ఫైనల్ హియరింగ్ నిర్వహించబోతోంది. ఈ మేరకు ఓ నోటీసు కూడా పంపింది. తనకు సంబంధించిన వివరాలేవీ సత్యనారాయణ ఎవరికీ కనబడకుండా దాచేసారనే ప్రచారం జరుగుతోంది. దాచటం ఎందుకంటే, ఆయనే సమాధానం చెప్పాలి. ప్రభుత్వాన్నీ తప్పుదోవ పట్టిస్తూ, న్యాయస్ధానానికీ సరైన సమాదానాలు చెప్పకుండా, ఆర్టిఐ వ్యవస్ధనూ బేఖాతరు చేస్తూ ఓ అధికారి అర్హత లేని పోస్టులో కొనసాగుతున్నారంటే నిజంగా నిప్పువారిది పారదర్శక ప్రభుత్వమే.