గుంటూరు వెస్ట్ అభ్యర్ధిగా అంబటి ఖాయమేనా?

First Published Mar 3, 2018, 9:52 AM IST
Highlights
  • లేళ్ళ అప్పిరెడ్డికి రాబోయే ఎన్నికల్లో టిక్కెట్టు ఇచ్చేది లేదని వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పేసారట.

గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైసిపికి ఈసారి కొత్త అభ్యర్ధి రంగంలోకి దిగనున్నారు. పోయిన ఎన్నికల్లో పోటీ చేసిన లేళ్ళ అప్పిరెడ్డికి రాబోయే ఎన్నికల్లో టిక్కెట్టు ఇచ్చేది లేదని వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పేసారట. మొదటి నుండి అప్పిరెడ్డి వ్యవహారశైలి వివాదాస్పదమే. పోయిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి మోదుగుల వేణుగోపాలరెడ్డి చేతిలో సుమారు 18 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. మోదుగులకు 78 వేల ఓట్లు వస్తే లేళ్ళకు 60 వేల ఓట్లు వచ్చాయి.

లేళ్ళకున్న ఓట్లతో వైసిపికి స్ధిరమైన ఓటు బ్యాంకున్న విషయం అర్ధమవుతోంది. దాంతో వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధిని మారిస్తే పార్టీ గెలుపు సులభమని జిల్లా నేతలతో పాటు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా జగన్ కు చెప్పారట. దాంతో లేళ్ళ స్ధానంలో కొత్త అభ్యర్ధిని చూస్తున్నారు.

నియోజకవర్గంలో మొదటినుండి కమ్మ, కాపుల ఓట్లే కీలకం. అయితే పోయిన ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలూ రెడ్డి అభ్యర్ధులను పోటీలోకి దింపాయి. టిడిపి నుండి సిట్టింగ్ ఎంఎల్ఏ మోదుగులే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే, మోదుగులే టిడిపిని వదిలేస్తారంటూ ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

ఒకవేళ మోదుగుల టిడిపిలోనే ఉంటే మాత్రం సిట్టింగ్ హోదాలో మళ్ళీ బరిలోకి దిగుతారు. అందుకనే వైసిపి వచ్చేసారి కమ్మ లేకపోతే కాపు నేతల్లో ఒకరిని రంగంలోకి దించాలని అనుకుంటున్నట్లు సమాచారం. కాపు అభ్యర్ధికి టిక్కెట్టు ఇచ్చేట్లయితే అంబటి రాంబాబు పోటీ చేస్తారంటూ పార్టీలో ప్రచారం జరుగుతోంది.

పోయిన ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గంలో స్సీకర్ కోడెల శివప్రసాద్ చేతిలో అంబటి కేవలం 713 ఓట్ల  తేడాతో ఓడిపోయారు. అయితే, వచ్చే ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఎటు తిరిగి గట్టి అభ్యర్ధిని దింపాలని అనుకున్నారు కాబట్టి కాపు కోటాలో బహుశా అంబటి ప్రయత్నం చేసుకుంటున్నట్లున్నారు. మరి, జగన్ ఏం చేస్తారో చూడాలి.

click me!