
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో మరోసారి అధికారులు ఇళ్ల కూల్చివేత ప్రక్రియను చేపట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇళ్ల కూల్చివేతలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమణల పేరుతో కావాలనే కక్ష గట్టి కూల్చివేతలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ బస్సు కూడా రాని ఊరికి ఆరు లైన్ల రహదారి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. తాము ఎంతో కష్టపడి డబ్బు కూడబెట్టి కట్టుకున్న ఇళ్లను అన్యాయంగా కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేత ప్రక్రియను వ్యతిరేకిస్తూ గ్రామస్థులతో కలిసి జనసేన మద్దతుదారులు నిరసనకు దిగారు. వైసీపీ ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇళ్ల కూల్చివేత ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఇప్పటంలో కూల్చివేతను జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ సభకు స్థలాన్ని ఇచ్చారనే వైసీపీ సర్కార్ కక్ష గట్టి మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఇదిలా ఉంటే.. రోడ్డు విస్తరణకు సంబంధించి గతంలో ఇప్పటంలో అధికారులు కట్టడాల తొలగింపు ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే తాజాగా మిగిలిన కట్టడాల తొలగింపుకు సంబంధించి ఇటీవల అధికారులు మరోమారు నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే నేడు గ్రామంలో కూల్చివేత ప్రక్రియను చేపట్టారు. కూల్చివేత ప్రక్రియ నేపథ్యంలో గ్రామంలో పోలీసులు కూడా భారీగా మోహరించారు. దీంతో ఇప్పటంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.