ఏపీలో మరో కొత్త పరిశ్రమకు జగన్ గ్రీన్ సిగ్నల్: 10వేల మందికి ఉపాధి

By Nagaraju penumalaFirst Published Oct 16, 2019, 8:47 PM IST
Highlights

ఏపీలో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు హాంకాంగ్ కు చెందిన ఇంటెలిజెంట్‌ ఎస్‌ఈజెడ్‌ లిమిటెడ్‌ సంస్థ ముందుకు వచ్చినట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో పరిశ్రమ ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు పరిశ్రమలు ఏపీలో అడుగుపెట్టిన నేపథ్యంలో తాజాగా హాంకాంగ్ కు చెందిన ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అందులో భాగంగా ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యింది ఆ బృందం. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదరక్షల తయారీకి సంబంధించి ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటుపై సీఎం జగన్ తో చర్చించారు. ఏపీలో రూ.700కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరించారు. 

పాదరక్షల తయారీకీ ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేయడం ద్వారా సుమారు 10వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని తెలిపింది. తొలివిడతగా రూ.350 కోట్లతో ఫుట్ వేర్ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని ఆ తర్వాత విస్తరణలో భాగంగా మరో రూ.350 కోట్లతో మరో యూనిట్ ఏర్పాటు చేస్తామని ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్ సంస్థ స్పష్టం చేసింది. 

అయితే ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్ సంస్థ ప్రతిపాదనపై సీఎం జగన్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. పరిశ్రమ స్థాపనకు సంబంధించి ప్రభుత్వం తరపున రావాల్సిన రాయితీలు అన్ని అందిస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. 


 
ఏపీలో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు హాంకాంగ్ కు చెందిన ఇంటెలిజెంట్‌ ఎస్‌ఈజెడ్‌ లిమిటెడ్‌ సంస్థ ముందుకు వచ్చినట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

పారదర్శకంగా పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఇస్తామని తెలిపారు. పరిశ్రమల నెలకొల్పేందుకు ఎలాంటి అవకతవకలకు తావు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నట్లు తెలిపారు మేకపాటి గౌతంరెడ్డి. 

click me!