వైఎస్ వివేకా హత్య కేసు వ్యాఖ్యలపై నోటీసులు: వర్ల రామయ్య స్పందన ఇదీ

By narsimha lodeFirst Published Oct 16, 2019, 5:26 PM IST
Highlights

దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై  విమర్శలు చేసిన వారికి ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకొని నోటీసులు జారీ చేశారు. 


గుంటూరు:  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  తనకు ఎలాంటి నోటీసులు అందలేదని టీడీపీ నేత వర్ల రామయ్య చెప్పారు.నోటీసులు అందితే ఆ నోటీసులకు ఎలా సమాధానం చెప్పాలో తనకు తెలుసునని  వర్లరామయ్య స్పష్టం చేశారు.

బుధవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు టీడీపీ నేత వర్ల రామయ్య ఇంటర్వ్యూ ఇచ్చారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలపై వైసీపీ తీవ్రంగా రియాక్టైంది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరో ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తెలుసునని కూడ టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇదే వ్యాఖ్యలపై మంగళవారం నాడు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కూడ పరోక్షంగా  హెచ్చరికలు జారీ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై  సిట్ విచారణ కొనసాగుతున్న విషయాన్ని డీజీపీ మంగళవారం నాడు గుర్తు చేశారు. ఈ విషయమై ప్రచారాలపై డీజీపీ స్పందించారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఊహాగానాలు, తప్పుడు ప్రచారాలు చేసిన వారికి నోటీసులు ఇస్తామని ప్రకటించారు. డీజీపీ ప్రకటించిన మరునాడే వర్లరామయ్యకు నోటీసులు జారీ అయ్యాయి.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని వర్ల రామయ్య ప్రకటించారు. తనకు నోటీసులు అందలేదని చెప్పారు. తన ఇంటికి పోలీసులు వచ్చారని చెప్పారు.

డీజీపీ కార్యాలయంలో పోలీసుల అధికారుల సంఘం మీడియా సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై తాను కూడ ఫిర్యాదు చేస్తానని వర్ల రామయ్య ప్రకటించారు. పోలీస్ క్రమశిక్షణ ఉల్లంఘించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

ఒక రాజకీయపార్టీ నేతగా తనకు మాట్లాడే హక్కుందన్నారు. కానీ తాను ఏమీ మాట్లాడకుండా చేసే ఉద్దేశ్యంతో నోటీసులు ఇచ్చి భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. ఇలాంటి నోటీసులకు తాను భయపడనని చెప్పారు. అసలు ఏం నోటీసులు పంపారో చూడాలన్నారు. ఆ నోటీసులకు తాను కూడ సమాధానం చెబుతానని ఆయన తేల్చిచెప్పారు.

పోలీసులు నోటీసులు పంపితే ఆ నోటీసులకు సమాధానం చెప్పడం కూడ తనకు తెలుసునని వర్ల రామయ్య చెప్పారు. ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పలువురు టీడీపీ నేతలపై కేసులు నమోదౌతున్నాయి. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు గత నెల 16వ తేదీన ఆత్మహత్య చేసుకొన్నాడు. వైసీపీ  ప్రభుత్వం కేసులతో వేధింపులకు గురి  చేయడం వల్లే కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకొన్నాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

click me!