అందు కోసమే: మూడు రాజధానులపై జగన్ తాజా ప్రకటన ఇదీ...

By team teluguFirst Published Aug 15, 2020, 10:46 AM IST
Highlights

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం విద్య ఆవశ్యకత నుంచి ప్రత్యేక అహోదా వరకు అనేక అంశాలపై ప్రసంగించారు. రాష్ట్ర అవసరాల దృష్ట్యా ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా తన ప్రసంగాన్ని సాగించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 74వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా  విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండా ఎగురవేశారు.  అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు.

ఆ తరువాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం విద్య ఆవశ్యకత నుంచి ప్రత్యేక అహోదా వరకు అనేక అంశాలపై ప్రసంగించారు. రాష్ట్ర అవసరాల దృష్ట్యా ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా తన ప్రసంగాన్ని సాగించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. 

జగన్ తన ప్రసంగంలో రాజ్యాంగంలో పొందుపరిచిన సామాజిక, ఆర్ధిక భరోసాల గురించి వివరించారు. సమానత్వం పదాన్ని పుస్తకాలకే పరిమితం చేయకూడదని, అది సమాజంలో ప్రతిబింబించాలని అన్నారు జగన్ మోహన్ రెడ్డి. 

పేదల జీవితాలను సమూలంగా మార్చడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు జగన్ మోహన్ రెడ్డి. రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, ఆసరా పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అవన్నీ కూడా పేదలకు చేయూతను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపడానికె అని సీఎం జగన్ అన్నారు. 

సంక్షేమ పథకాలను కులం, మతం, పార్టీలకతీతంగా ప్రజలకు అందిస్తున్నామని, ప్రజలందరి సంక్షేమమే ధ్యేయంగా 14 నెలల పాలన సాగిందన్నారు జగన్ మోహన్ రెడ్డి. 

ఆర్ధిక పరిస్థితులు సహకరించకున్నప్పటికీ.... ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని విద్య పరంగా నెలకొన్న అసమానతన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇందుకోసమే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని జగన్ అన్నారు.  

రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ఆర్ధిక సాయం చేస్తున్నామని,పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని అన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకే పాలనా వికేంద్రీకరణ చేస్తున్నామని, సమన్యాయం జరిగేలా మూడు రాజధానుల బిల్లును చట్టంగా మార్చామని అన్నారు. 

త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధానిని ఏర్పాటు చేస్తామని, కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధాని ఏర్పాటవుతుందని, జగన్ పునరుద్ఘాటించారు. 

పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం.. ప్రత్యేక హోదాను అమలు చేయాలని గట్టిగా అడుగుతూనే ఉన్నామని, భవిష్యత్తులో కూడా అడుగుతూనే ఉంటామని అన్నారు. 

కేంద్ర ప్రభుత్వం మిగతా పార్టీలపై ఆధారపడే పరిస్థితి లేదని, పూర్తి మెజారిటీతో ఉన్నందున ఇప్పటికిప్పుడు హోదా ఇచ్చే అవకాశం కనిపించకపోయినప్పటికీ... .. ప్రత్యేక హోదాను ఖచ్చితంగా  సాధించాలనే ధృఢసంకల్పానికి తాము కట్టుబడి ఉన్నామని  జగన్ అన్నారు. 

నేడు కాకపోతే భవిష్యత్‌లోనైనా కేంద్ర ప్రభుత్వం మనసు మారి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకంతో హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉంటామని అన్నారు. 

అవినీతి లేని వ్యవస్థ కోసం రివర్స్ టెండరింగ్‌, జ్యుడీషియల్ ప్రివ్యూ, డైరెక్ట్‌ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానాన్ని అమలు చేస్తున్నామని, కేవలం మొదటి 14 నెలల పాలనలోనే వివిధ పథకాల ద్వారా దాదాపు రూ.46వేల కోట్లు ప్రజలకు నేరుగా అందించామన్నారు జగన్ మోహన్ రెడ్డి. 

అవినీతి అనే చీడపురుగు వల్ల ప్రజలకు అందాల్సిన ఫలాలు అందకుండా పోతాయని, ఈ నిజాన్ని గమనించబట్టే రివర్స్ టెండరింగ్‌, జ్యుడీషియల్‌ ప్రివ్యూ గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష ద్వారా రూ.4వేల కోట్లకు పైగా ఆదా చేశామని జగన్ ఈ సందర్భంగా అన్నారు. 

జెండాను ఆవిష్కరించే ముందు ట్విట్టర్ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. "నేడు మనం ఆనందిస్తున్న స్వేచ్ఛను మనకు ప్రసాదంగా ఇచ్చిన వీరులకు నా వందనాలు. దేశ స్వతంత్రం కోసం ప్రాణాలర్పించినవారికి వందనం. మన దేశం విలువలను కాపాడుకుంటామని, దేశ ప్రతిష్టను రక్షిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం దేశ పురోగతికి కంకణబద్ధులమవుదాము" అని అన్నారు 

click me!